ఐపీఎల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

5 Apr, 2018 19:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దూరదర్శన్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అయితే మ్యాచ్‌లు చూసేందుకు కేబుల్ నెట్‌వర్క్ కనెక్షన్లు తీసుకునేవారు. ప్రస్తుతం కొన్ని టెలికాం సంస్థలు సైతం ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లోనూ ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా దూరదర్శన్‌లో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. కానీ, ఐపీఎల్ మ్యాచ్‌లు కాస్త ఆలస్యంగా ప్రసారం అవుతాయని పేర్కొంది.

మరోవైపు 2018-2022ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కూడా స్టార్‌ ఇండియానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో 2012-18 మధ్య హక్కులను రూ.3851 కోట్లకు స్టార్‌ ఇండియానే సొంతం చేసుకుంది. కాగా, టీమిండియా మ్యాచ్‌ల ప్రసార హక్కులను కళ్లు చెదిరే ధరను బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ సంస్థ ప్రసార హక్కులను నేడు (గురువారం) దక్కించుకున్న విషయం తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం 6,138 కోట్ల రూపాయలకు టీమిండియా మ్యాచ్ ప్రసార హక్కులు అమ్ముడయ్యాయి. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు