టీటీడీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే..

4 Sep, 2018 03:29 IST|Sakshi

కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ స్పష్టీకరణ

రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రజా సంస్థ సమాధానం చెప్పాల్సిందేనని వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు స్పష్టం చేశారు. ప్రజా సంస్థగా ఉన్న టీటీడీ.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో టీటీడీకి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీటీడీకి కేంద్ర సమాచార కమిషనర్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాడభూషి శ్రీధర్‌ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

టీటీడీలో నెలకొన్న వివాదం కేవలం శ్రీవారి నగల సమస్యో లేదా శ్రీవారి ప్రాచీన కట్టడాల సమస్యో కాదన్నారు. శాసనాల్లో ఉన్న నగలకు.. ప్రస్తుతం టీటీడీలో ఉన్న నగలకు అసలు పోలికే లేదని పురావస్తు శాఖకు చెందిన ఒక డైరెక్టర్‌ తనకు చెప్పినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై ప్రజలు ప్రశ్నిస్తే టీటీడీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఈ నెల 28న శ్రీవారి నగల వ్యవహారంపై విచారణ చేపడతామని తెలిపారు. జవాబుదారీగా ఉండేందుకు ప్రభుత్వానికి గానీ టీటీడీకి గానీ ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు