6100 కోట్ల రైతు రుణ మాఫీ

19 Dec, 2018 04:33 IST|Sakshi

ఛత్తీస్‌ సీఎం బఘేల్‌ ప్రకటన

రాయ్‌పూర్‌/గువాహటి/ భువనేశ్వర్‌: దాదాపు రూ.6,100 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ప్రకటించారు. బఘేల్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్‌ 30వ తేదీలోపు సహకార బ్యాంకులు, ఛత్తీస్‌గఢ్‌ గ్రామీణ బ్యాంకుల నుంచి 16.65 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.6,100 కోట్ల మేర రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. రుణమాఫీతో పాటు వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ.2,500కు పెంచుతామన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగు పడినట్లయింది.
  
అదే బాటలో అసోం.. 
సుమారు 8 లక్షల మంది రైతులకు చెందిన రూ.600 కోట్ల రుణాలను రద్దు చేయనున్నట్లు అసోంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల రైతు రుణాల్లో 25 శాతం వరకు రద్దు అవుతాయి. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల్లో రూ.10వేల సబ్సిడీ ఇస్తామని  తెలిపారు.
 
మేమూ చేస్తాం ఒడిశా బీజేపీ  
తమకు అధికారమిస్తే రైతుల రుణాలన్నిటినీ రద్దు చేస్తామని ఒడిశా బీజేపీ వాగ్దానం చేసింది. రాష్ట్రంలో 2019లో ఎన్నికలు జరగనున్నాయి. ‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నీ రద్దు చేస్తాం. రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్‌ పాండా తెలిపారు. ఇదే హామీని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్‌ ఇంతకుమునుపే ఇచ్చారు.  

మరిన్ని వార్తలు