చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ కన్నుమూత

14 Aug, 2018 17:06 IST|Sakshi

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరాం దాస్‌ టాండన్‌(90) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో రాయ్‌పూర్‌లోని డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్‌ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని రాజ్‌భవన్‌కు తరలించారు. అనంతరం ఆయన స్వస్థలం పంజాబ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నా తండ్రిలాంటి వారు..
బలరాం దాస్‌ టాండన్ మరణం పట్ల సీఎం రమణ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నాలుగేళ్ల పాటు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. విశేషానుభవం కలిగిన ఆయన తనకు పితృ సమానులని పేర్కొన్నారు.  
ఆరెస్సెస్‌ ప్రముఖ్‌గా...
బలరాం దాస్‌ టాండన్‌ 1927లో పంజాబ్‌లో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో ప్రచారఖ్‌గా పని చేశారు. జన సంఘ్‌ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1969- 70లో పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1975- 77 ఎమర్జెన్సీ సయమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన బలరాం దాస్‌ జూలై, 2014లో చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 
 

మరిన్ని వార్తలు