ఇక నుంచి టీవీ, ఫ్రిజ్ వాడుకుంటాం!

9 Apr, 2018 09:54 IST|Sakshi

15 ఏళ్ల తర్వాత గ్రామానికి కరెంట్

చింతల్నర్ గ్రామ మహిళలు హర్షం

రాయ్‌పూర్ : మావోయిస్టుల కారణంగా కోల్పోయిన వెలుగులు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేకుండాయి పోయాయి. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో 15ఏళ్ల కిందట జిల్లాలోని చింతల్నర్‌ గ్రామంలో వీరు మకాం వేశారు. తమ ఉనికి, కదలికలను పోలీసులు, అధికారులు గుర్తించొద్దని భావించిన మావోయిస్టులు ఈ గ్రామానికి విద్యుత్ సరఫరా లేకుండా చేశారు.

కరెంట్ స్తంబాలు, వైర్లను పూర్తిగా ధ్వంసం చేయడంలో దశాబ్దానికి పైగా గ్రామస్తులు అంధకారంలో మగ్గిపోయారు. అయితే సీఎం రమణ్ సింగ్ అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై చింతల్నర్‌ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ స్తంబాలు ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. 2010లో 76 మంది భద్రతా సిబ్బందిని మావోయిస్టులు హత్యచేయడంతో చింతల్నర్ గ్రామం తొలిసారి వార్తల్లోకెక్కింది.

దీనిపై చింతల్నర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మాట్లాడుతూ.. 'మా గ్రామానికి కరెంట్ వస్తుందని తెలియడంతో ఎంతో సంతోషించాం. మేం ఇకనుంచి టీవీ, రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) వాడుకోవచ్చు. విద్యార్థులు రాత్రి వేళల్లోనూ ఏ ఇబ్బంది లేకుండా చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ వెలుగులును మేం సద్వినియోగం చేసుకుంటామని' తెలిపారు.    

   

మరిన్ని వార్తలు