Chhattisgarh Elections Polling Updates: ఛత్తీస్‌గఢ్‌లో 71% పోలింగ్‌ 

8 Nov, 2023 02:30 IST|Sakshi
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద క్యూలో నిలబడి గుర్తింపు కార్డులు చూపిస్తున్న ఓటర్లు

తొలి దశలో 20 నియోజకవర్గాల్లో పోలింగ్‌

ఓటేసిన మాజీ సీఎం రమణ్‌ సింగ్, కాంగ్రెస్‌ చీఫ్‌ దీపక్‌ 

రాయ్‌పూర్‌/చర్ల: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి అంకానికి మంగళవారం ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకుగాను తొలి విడతలో 20 నియోజకవర్గాలకు మంగళవారం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం ఐదింటికి అందిన సమాచారం మేరకు 71.48శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికలను నక్సల్స్‌ నిషేధించడం, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత వంటి సమస్యలున్నా పోలింగ్‌ 70 శాతాన్ని మించడం విశేషం.

మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించడంతో ముందుజాగ్రత్తగా మధ్యాహ్నం మూడింటి వరకే పోలింగ్‌ను అనుమతించారు. వేరే పోలింగ్‌ కేంద్రాల వద్ద జనం బారులు తీరి ఉండటంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశాలున్నాయి. తొలి దశలో 20 నియోజకవర్గాల్లో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 16 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ.

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రమణ్‌ సింగ్, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ దీపక్, ముగ్గురు రాష్ట్ర మంత్రుల పోటీచేస్తున్న స్థానాల్లోనూ పోలింగ్‌ జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌ నుంచి బరిలో నిల్చిన రమణ్‌ సింగ్‌ తన స్వస్థలం కవర్ధాలో ఓటేశారు. ‘ ఈరోజు పోలింగ్‌ జరిగిన 20 స్థానాలకు 14 చోట్ల బీజేపీదే విజయం’ అని రమణ్‌సింగ్‌ అన్నారు. బస్తర్‌ డివిజన్‌లో ఏడు జిల్లాల పరిధిలోని 126 గ్రామాల్లో స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారిగా ఆయా గ్రామాల్లో ఏర్పాటైన పోలింగ్‌ కేంద్రాల్లో గ్రామస్తులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఒకప్పుడు నక్సలైట్‌ జీవితం గడుపుతూ అమ్‌దాయ్‌ ఏరియా కమాండర్‌గా ఉన్న మాజీ మహిళా నక్సలైట్‌ సుమిత్రా సాహూ తొలిసారిగా ఓటేశారు. 34 ఏళ్ల సుమిత్రా  నక్సలిజం వీడి 2019లో పోలీసు శాఖలో చేరి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్‌నంద్‌గావ్‌ పరిధిలోని రామ్‌నగర్‌  పోలింగ్‌ స్టేషన్‌లో ఒక ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు భారీ క్యూలో చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. 

దేశంలో తొలిసారిగా.. 
అంతాగఢ్‌ నియోజకవర్గంలో ట్రాన్స్‌జెండర్‌ ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏడువర్ణాల్లో ‘రెయిన్‌బో’ మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు. రెయిన్‌బో పోలింగ్‌బూత్‌లు ఏర్పాటుచేయడం దేశంలోనే తొలిసారి. ఇక్కడ భద్రత కోసం నలుగురు ట్రాన్స్‌జెండర్‌ పోలీస్‌ సిబ్బందిని నియమించడం విశేషం. పూర్తిగా మహిళా సిబ్బందితో 200 ‘సంఘ్‌వారీ’ పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు.  20 పోలింగ్‌ కేంద్రాలను దివ్యాంగులైన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్, మాజీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబు ఐజ్వాల్‌ సౌత్‌–2 నియోజకవర్గంలోని పోలింగ్‌కేంద్రంలో ఓటు వేశారు. 

దద్దరిల్లిన బస్తర్‌ 
ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్‌ సందర్భంగా మావోయిస్టులు రెచ్చిపోయారు. నాలుగుచోట్ల భద్రతాబలగాలతో ఎదురుకాల్పులకు దిగారు. ఒక మందుపాతర పేల్చారు. సుక్మా జిల్లా తొండామర్కా క్యాంపు సమీపంలోని ఎల్మగుండ వద్ద మావోలు అమర్చిన మందుపాతరపై పొరపాటున కాలుమోపిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండో శ్రీకాంత్‌ గాయపడ్డారు. కాగా, చింతగుఫ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

కాంకేర్‌ జిల్లా బందే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పనావర్‌ గ్రామం సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే–47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బిజాపూర్, సుక్మా జిల్లా బందా, నారాయణ్‌పూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, బలగాలకు మధ్య స్వల్ప ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు