సామాన్యుడికి అవస్థలే అవస్థలు

9 Nov, 2016 04:17 IST|Sakshi
సామాన్యుడికి అవస్థలే అవస్థలు

- 500, 1000 నోట్లను అంగీకరించని వ్యాపారులు
- అత్యవసర పనులకు డబ్బు చెల్లింపులో సమస్యలు
- ఉన్న నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితి
- చేతిలో డబ్బున్నా చెల్లించలేని దుస్థితి
- ఏటీఎంల వద్ద క్యూలు, కొద్ది సేపటికే ‘నో క్యాష్’ బోర్డులు
- కార్డుపై ఎక్స్‌ట్రా ట్యాక్స్ అంటున్న వ్యాపారస్తులు
- సామాన్యుడి జీవితాన్ని స్థంభింపచేసిన కేంద్రం నిర్ణయం
 
► రామ్ ప్రసాద్ వాళ్ల నాన్నగారికి బుధవారం హస్పటల్‌లో బైపాస్ సర్జరీకి ప్లాన్ చేసుకున్నాడు. హాస్పటల్‌లో చేర్చి ఇప్పటికే రెండు రోజులరుు్యంది. ఆపరేషన్ ముందు లక్ష రూపాయలు డిపాజిట్ చేయమనడంతో ఉదయం ఏటీఎం నుంచి కానీ, బ్యాంకుకు వెళ్లి కానీ డ్రా చేసి చెల్లిద్దామనుకున్నాడు. కానీ రాత్రి ఒక్కసారిగా ఈ వార్త విన్నవెంటనే పరుగెత్తుకుంటూ ఏటీఎంకు వెళ్ళాడు. అప్పటికే ఏటీఎం దగ్గర జనం బారులు తీరి ఉన్నారు. కాసేపటికే నో క్యాష్ అని బోర్డు పెట్టేశాడు. బుధవారం బ్యాంకులు పనిచేయక... బుధ, గురువారాలు ఏటీఎంలు పనిచేయక, ఆ తర్వాత నుంచి పనిచేసిన నగదు తీసుకోవడంపై పరిమితులు ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి.

► తిరుపతికి చెందిన ఆనంద్ తన కుమార్తె పెళ్లికోసం బుధవారం చెన్నై వెళ్లి నగలు, కంచిలో పట్టు చీరలు కొనేందుకు డబ్బు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు అకస్మాత్తు నిర్ణయంతో ఏం చేయాలో పాలు పోవడంలేదు. వివాహ సమయం దగ్గర పడుతోంది. రేపట్నుంచి దుకాణాల వారు 500, 1000 నోట్లు అంగీకరించరు. బ్యాంకుకు వెళ్లి రూ.100 నోట్లకు మార్చుకుందామంటే రూ.నాలుగు వేలకంటే మార్చబోమంటున్నారు. ఈ గడ్డు సమస్యను ఎలా గట్టెక్కాలో తెలియక మిత్రులందరినీ సలహాలు అడుగుతున్నాడు.

► విశాఖపట్నానికి చెందిన సుందర్జ్రు కుమారుడికి కర్ణాటకలోని ఒక వైద్య కళాశాలలో సీటు వచ్చింది. ఫీజుతోపాటు అదనంగా కొంత చెల్లించాల్సి ఉంది. స్వంత ఊరిలో ఉన్న పొలం అమ్మి డబ్బు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రధాని ప్రకటనతో ఆయన నివ్వెరపోయాడు. పొలం అమ్మి మరీ కూర్చుకున్న డబ్బు చెల్లదంటే ఎలా? అంటూ కూలిపోయాడు. బ్యాంకులో మార్చుకునే అవకాశమున్నా అందుకు సమయం పడుతుందనీ, ఈ లోపు తన కుమారుడి సీటు క్యాన్సిలైతే అతని భవిష్యత్తు అంధకారమ వుతుందని ఆందోళన చెందుతున్నాడు.

► విజయవాడకు చెందిన సత్యవాణి పదో తరగతి చదువుతున్న తన కొడుక్కి రూ.500 నోటు ఇచ్చి ఇంట్లోకి సరుకులు, పాలు ప్యాకెట్లు తేవాలని పంపింది. పాల బూత్ నుంచి కిరాణా షాపు వాళ్లు సైతం రూ.500 నోటు తీసుకోవడంలేదని చెప్పడంతో కాళ్లరిగేలా షాపులు తిరిగినా ఫలితంలేకపోవడంతో ఇంటికి చేరాడు. ప్రధాని ప్రకటన విషయాన్ని అప్పటికే టీవీల్లో చూసిన గృహిణి కొడుకు సరుకులు తేకుండా రావడంతో ఉదయం వాడిని స్కూల్‌కు పంపించేందుకు క్యారేజీ ఏం పెట్టాలంటూ దిగాలు పడుతోంది.

సామాన్యుడికి ఇబ్బందులిలా!
కేంద్రప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల చెలామాణీని రద్దుచేయడంతో సామాన్యుడి జీవితమిలా అతలాకుతలమవుతోంది. తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇచ్చినా... చెలామణీని వెంటనే రద్దు చేయడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రతీ ఒక్కరి జేబులో లేదా పర్సులో రూ. 500, రూ. 1000 నోట్లు ఉండటం అత్యంత సహజం. ఇప్పుడు వీటిని రద్దు చేయడంతో నేటి నుంచి పూర్తి లావాదేవీలు ఆగిపోయే పరిస్థితి. బయటకు వెళితే షాపు వాడు తీసుకోడు. ఏదైనా కొనుక్కొని తిందామంటే చిల్లర దొరక్క జేబులో డబ్బులున్నా కొనుక్కొని తినలేని పరిస్థితి. ప్రధానమంత్రి మంగళవారం అర్థ రాత్రి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పినా వ్యాపారస్తులు నిన్న రాత్రి నుంచే ఈ నోట్లను తీసుకోవడం మానేయడంతో సామాన్యుడు దిక్కుతోచని పరిస్థితి.

పాలప్యాకెట్ నుంచి పెట్రోల్ వరకూ ఎలా కొనుక్కోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. నగరాలు, గ్రామీణా ప్రాంతాల్లో సైతం అందుబాటులో ఉన్న ఏటీఎం వద్ద రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్లు చేసి రూ.100 నోట్లు తీసుకునేందుకు చలికాలంలోను రాత్రి వేళలోనూ ప్రజలు క్యూలు కట్టారు. అరుుతే 500, 1000 నోట్లను భర్తీ చేసే స్థారుులో 100 నోట్లు లేకపోవడంతో కొద్ది సేపటికే ‘నో క్యాష్’ అని రావడంతో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఆకస్మిక నిర్ణయంతో ఇల్లు గడిచేది ఎలా అంటూ పేద, మధ్యతరగతి ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు.

ఎలా మార్చుకునేది..?
మన దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం వచ్చినా, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉండే కూలీలు, గ్రామీణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి బ్యాంక్ అకౌంట్లే లేవు. ఉన్న నోట్లను బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్ళి మార్చుకోవడంపై వీరికి అంతగా అవగాహన ఉండదు. వీరి నిరక్షరాస్యతను స్థానిక నాయకులు ఆసరాగా చేసుకొని వీరిని మోసం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నారుు. పోనీ బ్యాంకులు, పోస్టాఫీసులు వెళ్ళి మార్చుకోవాలంటే ఒక రోజు కూలిని వదులుకోవాల్సిందే.

పదవ తారీఖు నుంచి కొత్త నోట్లు చెలామణీలోకి తీసుకొస్తున్నా... ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించడంతో భారీ లావాదేవీలు చేసే వీలుండదు. ఈ మేరకు మా వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. అసలే ఇది పెళ్లిల సీజన్ కావడంతో పెళ్లిలకు కావాల్సిన నగదును ఇప్పటికే చాలామంది విత్‌డ్రా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు లాంఛనాల సమయంలో నగదు ఎలా ఇవ్వాలో అర్థంకాని పరిస్థితి. అసలు నల్లధనం ఉన్న వారు ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ నల్లధనం పేరుతో సామాన్యునులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారేలేరు.

ఎక్స్‌ట్రా ట్యాక్స్
నెట్ బ్యాంకింగ్, కార్డుల ద్వారా నగదు లావాదేవీలను ప్రభుత్వం అనుమతిస్తానంటోంది. కానీ ఇలా లావాదేవీలు అనుమతించే వ్యాపారస్తులు లెక్కలు తప్పక చూపించాల్సి ఉంటుంది. దీంతో కార్డులపై లావాదేవీలు అంటే రెండు నుంచి మూడు శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నగదు చెలామణిలో ఉన్నప్పుడే చాలామంది ఎక్స్‌ట్రా తీసుకునేవారని, ఇప్పుడు సమయం వచ్చిందని మరింత ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో వీరిపై తగినంత దృష్టి పెట్టాలని వినియోగదారులు బ్యాంకులను కోరుతున్నారు.
 
ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో..
మోదీ ప్రకటన తర్వాత ఏటీఎంల వద్ద క్యూలు చూస్తే భయం వేసింది. రేపు బ్యాంకుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళనగా ఉంది. డబ్బులు తీసుకోవటం ఇవ్వటం ఒక ప్రహసనంలా ఉంటుంది.     
- ఈశ్వర్ (విజయవాడ)

 
బ్యాంకులోనే రోజులు గడపాలేమో  
నల్లధనాన్ని వెలికి తీసేం దుకు 500, వెరుు్య రూపాయల నోట్లను  నిలిపివేయటం మంచి దే. అరుుతే మాకు ఎక్కువ మంది రూ.500, రూ.1,000 నోట్లను ఇస్తారు. మేము వాటిని తీసుకుని డ్యూటీ దిగిన తరువాత మార్చుకోవటానికి బ్యాంకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అంటే ఒక రోజు డ్యూటీ చేస్తే మరోరోజు రద్దీ కారణంగా బ్యాంకుకే సరిపోతుందేమోనని భయంగా ఉంది.
- వేణు, డ్రైవర్ (మధురానగర్, విజయవాడ)
 
 పంటను కాపాడుకునేదెలా?
  ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శివారెడ్డి. అనం తపురం జిల్లా శింగనమల మండలం సోదనపల్లి వాసి. ఐదెకరాల పొలం ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. పొలంలో కంది, పెసర సాగు చేశారు. ఇంట్లో ఖర్చులకు డబ్బు లేకపోతే ఆదివారం మరో వ్యక్తి వద్ద రూ.10వేలు అప్పు తెచ్చుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి అన్నీ రూ.500 నోట్లు ఇచ్చారు. మంగళవారం రాత్రి 8.45 గంటలకు పురుగుల మందు దుకాణానికి వెళ్లాడు. రూ.500 నోట్లు తీసుకోలేదు. ఎందుకంటే ‘ఈ రోజు అర్ధరాత్రి నుంచి చెల్లవు.. నువ్వు ఇస్తే నేనేం చేసుకోవాలి’ అని వ్యాపారి అన్నారు. అప్పటికప్పుడు వందనోట్లు శివారెడ్డికి దొరకవు. చేసేది లేక ఇంటికి వచ్చారు. రెండురోజులు బ్యాంకులు, ఏటీఎంలు సెలవని శుక్రవారం వందనోట్లు తీసుకుని పోవాలని ఇరుగు పొరుగువారు చెప్పారు.

ఓవైపు పంట పొలానికి అర్జంటుగా మందులు కొట్టాలి. అప్పు తెచ్చిన నోట్లు పనికిరావు. రెండురోజులు ఇంటి ఖర్చులకు కూడా డబ్బు కావాలి. ఇరుగు పొరుగును అడిగితే వారి వద్ద వందనోట్లు ఉన్నాయో, లేదో? ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇస్తారో.. లేదో? పిల్లోళ్ల ఖర్చులకు కూడా చేతిలో డబ్బు లేదని శివారెడ్డి వేదనప డుతున్నారు. పైగా తెచ్చిన పదివేలు తిరిగి ఇచ్చేందుకు వెళితే అప్పు ఇచ్చిన వ్యక్తి నాకు రూ.100 నోట్లు ఇవ్వు అని అడుతున్నారు.  
 
నల్లధనానికి దెబ్బ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనం, నకిలీ కరెన్సీలపై పెద్ద దెబ్బ. దీనివల్ల అవినీతి, ఉగ్రవాదంపై పోరాటం మరింత పటిష్టమవుతుంది. ఇది సాహసోపేత నిర్ణయం.
 - రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి

అసంబద్ధంగా ఉంది
నల్లధనాన్ని బయటికి తీసే చర్యలకు మా పార్టీ ఎప్పటికీ మద్దతు పలుకుతుంది. అరుుతే, నల్లధనం నియంత్రణపై గత రెండున్నరేళ్లుగా నోరు మెదపకుండా ఉండి, ఇప్పుడు అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అసంబద్ధంగా ఉంది. ఇది చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం చూపుతుంది.
- మొహమ్మద్ సలీం, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు

వారు బాధపడతారు
భారీగా పోగుపడిన గుప్త నిధుల ముప్పును అరికట్టేందుకు ఈ చర్య దోహదపడుతుంది. ఇది మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. పన్ను కట్టని ఆదాయాలు, ఆస్తులున్న వారు, నల్లధన వెల్లడికి తెచ్చిన రెండు పథకాలను వినియోగించుకోని వారు ఇప్పుడు చాలా బాధపడతారు.
- ఎంబీ షా, సిట్ చైర్మన్

నల్లధనం పోదు
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ముప్పు తీరదు. నల్లధనం సమస్యకు ఇది పరిష్కారం చూపదు. భారీ ఎత్తున నల్లధనం విదేశాల్లో పోగైఉంది. అది భారత బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి హవాలా ద్వారా విదేశాలకు చేరుతోంది. అలాగే బంగారు లాంటి ఖరీదైన వస్తువులు, బినామీ భూలావాదేవీల్లోనూ నల్లధనం దాగుంది.
 - కేరళ ప్రభుత్వం

ద్రవ్యోల్బణం అదుపులోకి
దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది నిర్మాణాత్మక మార్పులను తెస్తుంది. అలాగే నల్లధనంతోపాటు ద్రవ్యోల్బణాన్ని కూడా అదుపులోకి తెచ్చేందుకు దోహదపడుతుంది.  
- చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్

రాజకీయ డ్రామా అన్పిస్తోంది  
పైకి చూడ్డానికి ఇది చాలా బాగుందని అన్పించవచ్చు. నలుపు, తెలుపుల్లో ఈ పథకాన్ని పూర్తిగా పరిశీలించేవరకు ఇందులోని ఉద్దేశాలపై ఓ నిర్ణయానికి రాలేం. ఈ యావత్ పథకంలో ఏదో సస్పెన్స్‌ ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే 2017 మార్చిలో ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడుతున్న రాజకీయ డ్రామాలా ఉంది.
 -ఎం. నారాయణచార్యులు, చార్టర్డ్ అకౌంటెంట్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్.

మరిన్ని వార్తలు