ప్రభుత్వంలోకి రాకముందే అల్లర్లు!

6 Mar, 2018 18:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక ముందే ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలోనియా పట్టణంలోని రష్యా కమ్యూనిస్టు విప్లవ నాయకుడు లెనిన్‌ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం కాషాయ వర్గాల ‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాల మధ్య బుల్డోదర్‌తో కొందరు కూల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో పట్టణంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగడంతో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఖండించింది. 

‘చలో పల్టాయియే’ అనే నినాదంతో లెనిన్‌ విగ్రహాన్ని కూల్చివేస్తున్న దశ్యాన్ని బీజేపీ సీనియర్‌ నాయకుడు రామ్‌ మాధవ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేసి, ఆ తర్వాత కొంత సేపటికి తొలగించారు. త్రిపుర ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ‘చలో పల్టాయియే’ అనే నినాదాన్ని ఎక్కువగా ఇచ్చిన విషయం తెల్సిందే. లెనిన్‌ ఓ విదేశీయుడు, టెర్రరిస్టు లాంటి వాడని, ఆయన విగ్రహాన్ని తొలగిస్తే తప్పేమిటని  బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు సుబ్రమణియన్‌ స్వామి స్పందించారు. 

ఇక రాష్ట్ర గవర్నర్‌ తథాగథ రాయ్‌ మరో అడుగు ముందుకు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం ఓ పని చేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మరో ప్రభుత్వం ఆ పనిని తుడిచేస్తుందని సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. వీరి వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయి. బీజేపీ సంఘ్‌పరివార్‌ లెనిన్‌ విగ్రహాన్ని విధ్వంసం చేశాయని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఉద్రిక్తతలు ఏర్పడి అవి అల్లర్లకు, హింసాకాండకు దారితీస్తాయి. 

రాష్ట్రంలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన ఓ గవర్నరే బాధ్యతార హితంగా హింసను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఎలా? అప్పుడే సోషల్‌ మీడియాలో లెనిన్‌ విగ్రహం విధ్వంసం మీద నిప్పంటుకుంది. సమర్థించే, వ్యతిరేకించే మధ్య రచ్చ జరుగోతోంది. ఇప్పటికే ద్రవిడ ఉద్యమానికి మూలకర్తయిన పెరియార్‌ రామస్వామి అంటే పడని బీజేపీ మూకలు తమిళనాడులో ఆయన విగ్రహాలను తొలగిస్తామని హెచ్చరించాయి. 

ఈ నేపథ్యంలో వాటిని కూల్చేందుకు అల్లరి మూకలు ప్రయత్నిస్తే తమిళనాడు భగ్గు మనదా? మెజారిటీ ప్రజల మద్దతు ఉందనుకుని ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడిన 1984 నుంచి 2002 వరకు దేశంలో రక్తపాత సంఘటనలు పునరావతం అవుతాయి. తాజా సంఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించి త్రిపుర గవర్నర్‌ తథాతథ రావుతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎలా మందలించారో తెలియదు. 

 
 

మరిన్ని వార్తలు