ముల్లును ముల్లుతోనే...

9 May, 2019 02:20 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాషాయపక్షాన్ని కట్టడి చేసేందుకు కాంగ్రెస్‌ సైతం అదే కాషాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పదేళ్ళ పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ని ఓడించాలని బీజేపీ, ఎలాగైనా విజయతీరాలకు చేరాలని సీనియర్‌ కాంగ్రెస్‌ దిగ్గజం దిగ్విజయ్‌ సింగ్‌ ప్రచారానికి కాషాయాన్ని జోడించారు. భోపాల్‌లో మే 12న జరిగే ఆరోదశ లోక్‌సభ పోలింగ్‌లో నియోజకవర్గంలో దిగ్విజయ్‌సింగ్‌ వర్సెస్‌ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ల మధ్య పోల్‌వార్‌ హోరు పూజలూ, యజ్ఞాలతో రంజుగా మారింది. ఈ ఇరువురూ భోపాల్‌లో గెలుపుకోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

కాంగ్రెస్‌ని కట్టడి చేయడం కోసం మాలెగాం కేసులో జైలుపాలై అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్వి ని బరిలోకి దింపింది. అదే కాషాయ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న కాంగ్రెస్‌ ప్రగ్యాసింగ్‌కి ప్రతిగా దిగ్విజయ్‌ సింగ్‌ తరఫున కంప్యూటర్‌ బాబాని స్క్రీన్‌పైకి తెచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రగ్య, వివాదాస్పద కార్యక్రమాలతో దిగ్విజయ్‌సింగ్‌ ఇరువురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో భోపాల్‌ ఎన్నికల ప్రచారం కాషాయంతో కలగాపులగంగా మారింది. ఏది బీజేపీ యజ్ఞమో, ఏది కాంగ్రెస్‌ ప్రచారమో తెలుసుకోలేనంతగా ఇప్పుడు భోపాల్‌లో పరిస్థితి తారుమారయ్యింది.

ఇటీవలే కంప్యూటర్‌ బాబా దిగ్విజయ్‌ విజయం కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 5000 మంది సాధువులతో భారీ యాగాన్ని నిర్వహించారు. దీనికి ప్రతిగా ప్రగ్యా ఠాకూర్‌ అక్షయ తృతీయ సందర్భంగా పరశురామ్‌ జయంతి పూజలు భారీగా నిర్వహించడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నామ్‌దేవ్‌ త్యాగి అలియాస్‌ కంప్యూటర్‌ బాబా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ గెలుపుకోసం విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. దిగ్విజయ్‌ తరఫున యజ్ఞాలతో పాటు ప్రచారం కూడా చేస్తోన్న బాబా ప్రగ్యని ఉద్దేశించి బీజేపీ నాయకులు ప్రగ్యని బలిపశువుని చేశారని వ్యాఖ్యానిస్తే, సాధ్వి ప్రగ్య మాత్రం ఒకప్పుడు రాముడే మిథ్య అన్న వారు ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారనీ, అంతకు మించిన అచ్చాదిన్‌ ఏముంటాయంటూ తనపై విమర్శలను తిప్పి కొడుతున్నారు.

మరిన్ని వార్తలు