60 ఏళ్ల వయసులో మాజీ కేంద్రమంత్రి పెళ్లి

9 Mar, 2020 13:44 IST|Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ముకుల్‌ వాస్నిక్‌ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ముకుల్‌ వాస్నిక్‌, ఆయన స్నేహితురాలు రవీనా ఖురానాలు ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌ మరికొందరు నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముకుల్‌ వాస్నిక్‌ గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో రాహుల్‌ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ముకుల్‌ వాస్నిక్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కాంగ్రెస్‌ పార్టీలో ముకుల్‌ అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

కాగా.. ముకుల్‌ వాస్నిక్‌, రవీనా పెళ్లిపై రాజస్థాన్‌ సీఎం స్పందిస్తూ.. 'మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు అభినందనలు. రాబోయే రోజులు మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు. మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్‌ తివారీ స్పందిస్తూ.. 'ముకుల్ వాస్నిక్, రవీనా ఖురానా పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను 1984లో ముకుల్‌ను, 1985లో రవీనాను మొదటిసారిగా కలిశాను. వారిద్దరు పెళ్లి చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. మేమంతా కలిసి గతంలో మాస్కోలో జరిగిన వరల్డ్‌ యూత్‌ స్టూడెంట్స్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యామంటూ' తివారీ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు