గౌరీ లంకేశ్‌ కేసు... సీబీఐ కాదు సిట్‌ కరెక్ట్

7 Sep, 2017 10:09 IST|Sakshi
గౌరీ లంకేశ్‌ కేసు... సీబీఐ కాదు సిట్‌ కరెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ విచారణకు కూడా ఆదేశించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను అస్సలు నమ్మలేమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
 
కేంద్ర ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టే తాము సీబీఐ విచారణను వద్దంటున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు సిట్ కరెక్ట్. సీబీఐను నమ్మటానికి అస్సలు లేదు. అది నైతిక విలువలు లేని ఓ సంస్థ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సందీప్ దీక్షిత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరో నేత పీఎల్‌ పునియా ఘటనను భావ ప్రకటన హక్కుపై దాడిగా అభివర్ణించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం వీలైనంత త్వరగా కేసు చిక్కుముడి విప్పుతుందని భావిస్తున్నట్లు పునియా తెలిపారు. 
 
ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని కర్ణాటక ప్రభుత్వం గౌరీ లంకేశ్ హత్య కేసు కోసం నియమించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబడుతుండగా, అందుకు తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ  కూడా పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
>
మరిన్ని వార్తలు