భావ ప్రకటనకు మరింత బలం

13 Jun, 2019 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ పవిత్రమైనది. దాని గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఈ హక్కును ఉల్లంఘించే అధికారం రాజ్యానికి లేదు’ అంటూ ఉత్తరప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ కనోజియా అరెస్ట్‌ కేసులో సుప్రీం కోర్టు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ చేసిన అద్భుతమైన వ్యాఖ్యానం ఇది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గత ఏడాది కాలంగా వీడియో కాల్స్‌ ద్వారా తనతో టచ్‌లో ఉన్నారని, ఆయన తనతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటారా ? అంటూ ఓ మహిళ పంపిన వీడియో క్లిప్‌ను షేర్‌ చేసినందుకు యూపీ పోలీసులు జర్నలిస్ట్‌ కనోజియాను అరెస్ట్‌ చేశారు.

ఆయనను అరెస్ట్‌ చేశారనడానికన్నా కిడ్నాప్‌ చేశారని పేర్కొనడం సబబు. యూపీ నుంచి పౌర దుస్తుల్లో వచ్చిన పోలీసులు, ఢిల్లీ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కనోజియాను యూపీకి తీసుకెళ్లారు. ఈ చర్యను సవాల్‌ చేస్తూ ఆయన భార్య సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో సుప్రీం కోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మంచి వ్యాఖ్యానం చేసింది. తక్షణం కనోజియాను విడుదల చేయాల్సిందిగా కూడా యూపీ పోలీసులను ఆదేశించింది. భారతీయ శిక్షాస్మృతిలోని పరువు నష్టం దావాకు సంబంధించిన  500 సెక్షన్‌ కింద యూపీ పోలీసులు కేసును నమోదు చేశారు. ఎవరు పరవు నష్టం అయిందని భావిస్తున్నారో ఆ సదరు వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడే ఈ సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇది తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన నేరం కూడా కాదు. యూపీ ముఖ్యమంత్రి తరఫున అక్కడి పోలీసులు ఓవర్‌యాక్షన్‌ చేశారు. ఇదే కేసులో ‘నేషనల్‌ లైవ్‌ ఛానల్‌’కు చెందిన జర్నలిస్ట్‌లు అనూజ్‌ శుక్లా, ఇషికా సింగ్‌లను కూడా అరెస్ట్‌ చేశారు.

ఆ మధ్య మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్‌ చేశారన్న కారణంగా ప్రియాంక శర్మ అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెను కూడా కోర్టు జోక్యంతోనే విడుదల చేశారు. ఈ పరువు నష్టం దావాకు సంబంధించిన చట్టం బ్రిటీష్‌ కాలం నాటిది. అది ఏదో రూపంలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సెక్షన్‌ కింద పోలీసులు పౌరులను అరెస్ట్‌ చేయడం, సుప్రీం కోర్టు జోక్యంతో వారిని విడుదల చేయడం జరుగుతోంది. ఇలాంటి కేసుల్లో బాధ్యులను, అంటే ఇక్కడ తప్పుడు కేసును బనాయించినందుకు పోలీసులపై తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి కేసులు పునరావృతం కావు. ఏదేమైనా సుప్రీం కోర్టు తాజా తీర్పుతో భావ ప్రకటనా స్వేచ్ఛకు మరింత బలం చేకూరింది.

మరిన్ని వార్తలు