215 రోజుల రోడ్‌మ్యాప్

14 Jul, 2013 04:13 IST|Sakshi

పసునూరు మధు, న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రక్రియకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కోర్ కమిటీకి ప్రత్యేకంగా ఓ నోట్‌ను సమర్పించారు. ‘అధిష్టానం ముందుగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలి. ఆ తర్వాత 215 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల’న్నది ఆ ప్రత్యేక నోట్ సారాంశం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హైకమాండ్ ప్రకటన వెలువరించిన రోజు నుంచి రాష్ర్టపతి ఆమోదం పొందే వరకు 215 రోజుల పాటు వ్యవహారాన్ని నడిపించడం ద్వారా పార్టీకి లాభం కలుగుతుందని అందులో వివరించారు. హైకమాండ్ తెలంగాణ ప్రకటించిన తరువాత మిత్రపక్షాలను ఒప్పించడం, తరువాత కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, గడువులోగా నివేదిక అందజేయడం, ఆ తరువాత కేంద్ర కేబినెట్ సమావేశమై రాష్ట్ర విభజన తీర్మానం చేయడం, అనంతరం దాన్ని రాష్ట్రపతికి పంపడం, అక్కడి నుంచి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, తీర్మానం నెగ్గినా, ఓడినా నిర్ణీత గడువులోగా పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పెట్టడం, అది ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపడం... ఇలా ఒక్కో ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం పక్షం రోజుల గడువు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కో దశకు కొంత గడువు నిర్దేశిస్తూ మొత్తంగా 215 రోజుల్లో పూర్తి చేసే ప్రణాళికను అందులో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు