విమాన ఆలస్యానికి కారణమైతే భారీ జరిమానా!

18 Apr, 2017 02:05 IST|Sakshi
విమాన ఆలస్యానికి కారణమైతే భారీ జరిమానా!

ప్రతిపాదనల్ని సిద్ధం చేసిన ఎయిరిండియా
►  గంటలోపురూ. 5 లక్షలు
►  1–2 గంటల మధ్య రూ. 10 లక్షలు
►  2 గంటలు దాటితే రూ. 15లక్షలు


న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనవసర ఘర్షణలకు దిగి విమాన ప్రయాణం ఆలస్యం కావడానికి కారణమయ్యే ప్రయాణికులు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. వారిపై భారీగా జరిమానా విధించాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఈ దిశగా ప్రతిపాదనల్ని కూడా సిద్ధం చేసింది. గొడవ వల్ల గంట ఆలస్యానికి రూ. 5 లక్షలు, గంట–రెండు గంటల మధ్య ఆలస్యానికి 10 లక్షలు, రెండు గంటలు దాటితే 15 లక్షలు జరిమానా విధించాలని ప్రతిపాదించినట్లు ఎయిరిండియా వర్గాలు చెప్పాయి.

మరోవైపు దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల్ని అదుపుచేసేందుకు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. విమానంలో ప్రయాణికులు గొడవ పడితే వెంటనే ఎయిరిండియా సీఎండీ లేదా ఇతర ఉన్నతాధికారులకు తెలపాలని, మీడియాకు మాత్రం వెల్లడించవద్దని సిబ్బందికి ఎయిరిండియా స్పష్టం చేయనుంది. అలాగే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చూడాలని, ఆస్తి నష్టం జరిగితే ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గత నెల్లో ఎయిరిండియా ఉద్యోగిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం గైక్వాడ్‌పై ఎయిరిండియాతో పాటు, ఇతర విమానయాన సంస్థలు రెండు వారాల పాటు నిషేధం విధించాయి. నిషేధాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌లో శివసేన పార్టీ సభ్యులు బీభత్సం సృష్టించారు. చివరకు క్షమాపణలు చెపుతూ విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు గైక్వాడ్‌ లేఖ రాయడంతో నిషేధం ఎత్తివేశారు. ఆ తర్వాత కూడా ఎయిరిండియా సిబ్బంది, ప్రయాణికుల మధ్య ఘర్షణ పూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. మరో ఘటనలో ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లే ఎయిరిండియా విమానంలో తృణమూల్‌ ఎంపీ డోలా సేన్, సిబ్బంది మధ్య గొడవతో ప్రయాణం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా జరిమానాకు సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు