సవతి తండ్రి పేరే కావాలి

9 Dec, 2015 19:10 IST|Sakshi
సవతి తండ్రి పేరే కావాలి

న్యూఢిల్లీ: కన్నతండ్రి కంటే.. సవతి తండ్రే తనకు ముఖ్యమంటున్నాడు ఢిల్లీకి చెందిన ఓ బాలుడు. కన్నకొడుకు కంటే మిన్నగా ఆదరించిన ఆయననే తనకు చట్టబద్ధమైన తండ్రిగా గుర్తించాలంటున్నాడు. అతని కొడుకుగానే తనకు విదేశాల్లో చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలంటున్నాడు.  

ఇంటర్ చదువుతున్న ఢిల్లీకి చెందిన విద్యార్థి (17) పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. అందుకు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. దరఖాస్తు ఫారంలో తండ్రి పేరు స్థానంలో తన సవతి తండ్రి పేరు రాశాడు. దీంతో  అధికారులు పాస్పోర్టును తిరస్కరించారు. అంతే.. వివాదం మొదలైంది. దీనిపై సదరు బాలుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. సవతి తండ్రినే తనకు నిజమైన గార్డియన్గా గుర్తించాలని కోర్టును కోరుతున్నాడు.
 
తల్లిదండ్రులుగా.. అసలు తల్లిదండ్రులు లేదా పెంపుడు తల్లిదండ్రులు లేదా సవతి తల్లిదండ్రుల పేర్లను పేర్కొనే అవకాశాన్ని అభ్యర్థులకే వదిలేయాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. తండ్రి నుంచి తను, తన తల్లి ఎపుడో విడిపోయామని, ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. విడాకుల పత్రంలో ఈ విషయం స్పష్టం ఉందని అతడు చెప్పాడు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ విద్యార్థి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేమని నిపుణులంటున్నారు. చట్ట ప్రకారం దత్తత తీసుకుంటే తప్ప వారి బంధాన్ని అంగీకరించలేమంటున్నారు. అందునా ఆ విద్యార్థికి ఇంకా 18  ఏళ్లు నిండలేదు కనుక కన్నతండ్రే గార్డియన్ అవుతాడంటున్నారు.  

ఇలాంటి చిక్కు సమస్యలు చాలాసార్లు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళల పిల్లలు తరచు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ చట్టంలోని నిబంధనను మార్చాలని న్యాయవాది ఫ్లావియా ఏగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాలుని తండ్రి  స్పందిస్తూ.. ఒక్క బర్త్ సర్టిఫికెట్‌లో తప్ప, మిగిలిన అన్ని  సర్టిఫికెట్లలో తండ్రిగా తన పేరే ఉందన్నారు. ఈ పాస్పోర్ట్ వ్యవహారంలో ఒకవేళ కన్నతండ్రి పేరును ప్రస్తావిస్తే మరింత గందరగోళంగా మారేదన్నారు. అటు నిబంధనలకు విరుద్ధంగా తామేమీ చేయలేమని పాస్పోర్టు జారీ అధికారులు  తెలిపారు. మరి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు