జయకు పాస్‌పోర్ట్‌ వచ్చిం... దహో!

29 Oct, 2023 00:10 IST|Sakshi

వైరల్‌

హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్‌ అండ్‌ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్‌ షెప్పర్డ్, పమేరియన్‌లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్‌ మాత్రం అలా అనుకోలేదు.

నెదర్‌ ల్యాండ్స్‌కు చెందిన మెరల్‌ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్‌ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్‌ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క.

ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ  కామెంట్‌ పెట్టింది మెరల్‌.

మరిన్ని వార్తలు