ఢిల్లీలో మళ్లీ సరి–బేసి

10 Nov, 2017 02:02 IST|Sakshi

ఈ నెల 13 నుంచి ఐదురోజుల పాటు అమలు

నిర్మాణ పనులు, పారిశ్రామిక కార్యకలాపాలపై ఎన్జీటీ నిషేధం

మూడు రాష్ట్రాలు, కేంద్రానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పొగ మంచు కారణంగా కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి ఐదు రోజుల పాటు వాహనాల సరి–బేసి విధానాన్ని మళ్లీ అమలుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకీ క్షీణిస్తున్న వాయు నాణ్యతను పరిరక్షించేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) గురువారం పలు చర్యలు ప్రకటించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో నిర్మాణ పనులు, వ్యర్థాల దహనాన్ని నిషేధించడంతో పాటు, రాజధాని ప్రాంతంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించింది. మరోవైపు, ఇదే వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీ, పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో కాలుష్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ పరిష్కార మార్గాలు సిఫార్సు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాజధానిలో ‘కాలుష్య అత్యయిక’ పరిస్థితి వరసగా మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. శనివారం వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. వాయు నాణ్యత సూచీ 500 పాయింట్ల స్కేలుపై 486గా నమోదైంది.   

ద్విచక్ర, మహిళలకు మినహాయింపు
ఢిల్లీలో మరో దఫా సరి–బేసి విధానానికి రంగం సిద్ధమైంది. నవంబర్‌ 13 నుంచి ఈ విధానాన్ని ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఐదు రోజులు అమలుచేస్తారు. ద్విచక్ర వాహనాలు, మహిళలు, సీఎన్‌జీ ఇంధనంతో నడిచే వాహ నాలకు  మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ వెల్లడించారు.    

కాలుష్యంతో జీవించే హక్కు ఉల్లంఘన
ఢిల్లీలో పరిస్థితిపై ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంఘాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టొద్దని, అలాగే కాలుష్య కారకాలు వెదజల్లుతున్న అన్ని పారిశ్రామిక కార్యకలాలపై నవంబర్‌ 14 వరకు నిషేధం విధిస్తున్నట్లు చైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంతర్‌æ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. పదేళ్లకు పైబడిన డీజిల్‌ ట్రక్కులను ఢిల్లీలోకి అనుమతించకూడదని ఆదేశించింది. కా లు ష్యాన్ని ఎదుర్కొనేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ రెండు వారా ల్లోగా నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి నోటీసులు పంపింది. కాలుష్యాన్ని విస్మరించడం జీవించే హక్కును ఉల్లంఘించడంతో సమానమని వ్యాఖ్యానించింది.

కృత్రిమ వర్షం కురిపించండి: ఢిల్లీ హైకోర్టు
పొగమంచు కట్టడికి ఢిల్లీ హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. దుమ్ము, ధూళి గాల్లోకి చేరకుండా నిరోధించేలా మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించే అవకాశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ పట్టణంలో నిర్మాణ పనులు సాధ్యమైనంత ఎక్కువ కాలం నిలిపివేసేందుకు తగిన మార్గాలను కనుగొనాలని కోరింది. ప్రస్తుతం ఢిల్లీలో చూస్తున్న పరిస్థితిని లండన్‌ ఇది వరకే ఎదుర్కొందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు