పెట్టుబడిలో పావు భాగమూ రావట్లేదు | Sakshi
Sakshi News home page

పెట్టుబడిలో పావు భాగమూ రావట్లేదు

Published Fri, Nov 10 2017 2:02 AM

ys jagan fire on ap govt - Sakshi

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎండనక, వాననక కష్టపడుతున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. అయినా ఫలితం కనబడటం లేదు. సాగు కోసం పెట్టిన పెట్టుబడిలో పాతిక భాగం కూడా రావట్లేదు. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్నాం. అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. బుడ్డ శనగలు, మినుములు, ధనియాలు ఏది పండించినా మా బతుకులు మారటం లేదు. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. రుణ మాఫీ సొమ్ము వడ్డీకి కూడా సరిపోలేదు.. బతకడమే కష్టమనిపిస్తోంది..’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గిట్టుబాటు ధరలు లభించని బుడ్డ శనగలు, మినుములు, ధనియాలు తదితర పంటలు తెచ్చి వై.కోడూరు కూడలిలో జగన్‌కు చూపించారు.   

ఏది సాగు చేసినా..  
బుడ్డ శనగలు పండించాలంటే ఎకరానికి రూ. 26 వేల వరకూ ఖర్చవుతోందని, కానీ క్వింటాకు రూ.4,600 మాత్రమే ధర పలుకుతోందని వాపోయారు. గతేడాది క్వింటాలు రూ.10,700 ఉండేదని, నెల కిందట ప్రభుత్వం క్వింటాకు రూ.4,600 చొప్పున కొనుగోలు చేసిందని చెప్పారు. ఆ సమయంలో బయటి మార్కెట్‌లో క్వింటా ధర రూ.5 వేలకు పైనే ఉండేదని వివరించారు. కానీ అంతకూడా ఇవ్వని ప్రభుత్వం.. క్వింటా రూ.8,024కు కొనుగోలు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, దళారులే కలసి 40 శాతం సబ్సిడీ నిధులు దిగమింగారని ఆక్రోశం వ్యక్తం చేశారు. మినుములు పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని వాపోయారు. గతేడాది క్వింటా ధర రూ.14,200 పలికితే.. ఈ ఏడాది రూ.3,700 మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.28 వేల వరకూ ఖర్చయ్యిందని.. లాభం తర్వాత పెట్టుబడి కూడా రాకపోతే ఎలా బతకాలయ్యా.. అంటూ జగన్‌ వద్ద వాపోయారు. ధనియాలు సాగు చేసినా అదే పరిస్థితి అన్నారు. గతేడాది క్వింటా రూ.4,600గా ఉన్న ధనియాల ధర.. ఇప్పుడు రూ.1,600 మాత్రమే ఉందని చెప్పారు. ఎకరా సాగుకు రూ.14 వేల వరకూ ఖర్చు చేస్తున్నామన్నారు.

అధికారంలోకి రాగానే ఆదుకుంటాం: వైఎస్‌ జగన్‌
రైతుల బాధ విన్న వైఎస్‌ జగన్‌ చలించిపోయారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. పంట నూర్పిడికి ముందే గిట్టుబాటు ధర నిర్ణయిస్తామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలిచ్చి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ ప్రకటించిన వెంటనే.. చంద్రబాబు రూ.5 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొన్నటి వరకు అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వకపోవటం దారుణం. ఒక్క వైఎస్సార్‌ జిల్లాలోనే 20,160 మంది బుడ్డ శనగ రైతులకు 2012–13 ఏడాదికి గానూ మూడో విడత ఇన్సూరెన్స్‌ కింద రూ.156 కోట్లు రావాల్సి ఉంది.  2015 ఖరీఫ్‌కు సంబంధించి రూ.42 కోట్లు చెల్లించాల్సి ఉంది..’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఈ కష్టాలంటూ తాత్కాలికమేనంటూ వారిని ఓదార్చారు. రైతులతో పాటు వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement