పండుటాకు పదిలమిలా!

19 Sep, 2014 23:12 IST|Sakshi
పండుటాకు పదిలమిలా!

- ఈతరానికి తెలియజెప్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం
- ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు
 న్యూఢిల్లీ: కనీ.. పెంచీ.. పెద్దచేసిన తల్లిదండ్రులకు ఈతరం యువతీయువకులు ఇస్తున్న గౌరవం అంతంతమాత్రమే. రెక్కలు రాగానే చదువులు, ఉద్యోగాలం టూ ఎక్కడికో ఎగిరిపోతున్నారు. దీంతో వృద్ధాప్యంలో చూసుకునేవారు లేక ఒం టిరి పక్షుల్లా బిక్కుబిక్కుమంటూ కాలం గడపుతున్నవారి సంఖ్య తక్కువేం కాదు. కొందరైతే కొడుకులు, బిడ్డలు ఉండి కూడా వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. అలా ఎందుకని అడిగితే తమను చూసుకోవడానికి పిల్లలకు సమయం లేదని చెబుతున్నారు.

నగరంలో ఇలాంటి దుస్థితిలో ఉన్న పండుటాకులు ప్రతి గల్లీలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయి. పెద్దలపట్ల యువతీయువకుల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని, డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈతరం పిల్లలు మూలాలను మర్చిపోతున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
 
ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ దిశగానే ఆలోచిస్తోంది. వయోధికులపట్ల పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. పెద్దల విలువ చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని చెబుతున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా తెలిజెప్పే ప్రయత్నం చేస్తామంటున్నారు. పెద్దల్లో ఎంతో మేధాశక్తి దాగుంటుందని, దానిని ఈనాటి యువత ఉపయోగించుకుంటే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని, ఎన్నో ఉపద్రవాలను నిరోధించవచ్చని చెబుతున్నారు ప్రభుత్వ మాజీ అధికారి భూరేలాల్.

సాంఘిక సంక్షేమశాఖ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని భూరేలాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం నగరంలోని ప్రతి పదిమందిలో ఒకరు సీనియర్ సిటిజన్. ఇక ఢిల్లీ పోలీసుల వద్ద ఉన్న వివరాల ప్రకారం... వయోధికులపై జరుగుతున్న దారుణాల్లో ఎక్కువగా సొంతవారే నేరస్తులుగా తేలుతున్నారు. సరిగా పట్టించుకోకపోవడం, వదిలించుకోవాలని చూడడం, అవసరమైతే హతమార్చాలని భావిస్తుండడం, ఆస్తి కోసం చిత్రహింసలు పెట్టడం వంటి నేరాలకు సొంతవారు పాల్పడుతుంటే వృద్ధులు.. బలహీనులన్న అంశాన్ని అవకాశంగా చేసుకొని బయటివారు పండుటాకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు నగరంలో ఏటా పెరిగిపోతుండడంతో ఢిల్లీ సర్కార్ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.

>
మరిన్ని వార్తలు