అసెంబ్లీలో బెంచి ఎక్కిన ఎమ్మెల్యే

11 Jun, 2016 08:16 IST|Sakshi
అసెంబ్లీలో బెంచి ఎక్కిన ఎమ్మెల్యే

ఢిల్లీ అసెంబ్లీలో చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా నిరసన వ్యక్తం చేయడానికి ఏకంగా బెంచి ఎక్కి నిలబడ్డారు. ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న గుప్తా.. ముందు వరుసలో స్పీకర్‌కు ఎడమవైపు కూర్చుంటారు. తెల్లటి కుర్తా, పైజమా ధరించిన ఆయన.. ఒక్కసారిగా ఉన్నట్టుండి బెంచి మీదకు ఎక్కి నిలబడ్డారు. ట్యాంకర్ల స్కాం గురించి మాట్లాడుతూ, నిరసన వ్యక్తం చేయడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో స్పీకర్ సహా సభ్యులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. కొంతమంది సభ్యులు ఆయన నిలబడటాన్ని సెల్‌ఫోన్లలో వీడియో తీసుకున్నారు.

ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇలా బెంచి మీద నిలబడటం తాను ఎప్పుడూ చూడలేదని, ఇది చాలా సిగ్గుచేటని స్పీకర్ రామ్ నివాస్ అన్నారు. సభాసమయాన్ని మీరు హైజాక్ చేస్తున్నారంటూ గుప్తా మీద మండిపడ్డారు. అయితే గుప్తా మాత్రం ఆయన మాటలు వినిపించుకోకుండా తన నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. విపక్ష నేతగా ఉన్న మీరు ఇలా చేయడం బాగోలేదని, వెంటనే కూర్చోవాలని స్పీకర్ పదే పదే ఆయనకు విజ్ఞప్తి చేశారు.

70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. మిగిలినవాళ్లంతా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులే. గుప్తా నిరసన వ్యక్తం చేసే సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సభలోనే ఉన్నారు.

మరిన్ని వార్తలు