రూ.350 కోసం దారుణ హత్య

24 Nov, 2023 06:02 IST|Sakshi

ఢిల్లీలో 18 ఏళ్ల యువకుడిని చంపేసిన బాలుడు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బాలుడు కేవలం రూ.350 కోసం 18 ఏళ్ల యువకుడిని అత్యంత పాశవికంగా హత్యచేశాడు. హత్య చేసి దోచుకున్న సొమ్ముతో బిర్యానీ తిందామని నిందితుడు భావించాడు. గొంతు నులిమి ఊపిరిపోయేలా చేసి కుప్పకూల్చాడు. వెంటనే కత్తితో విచక్షణారహితంగా 60 సార్లకుపైగా పొడిచాడు. తల, మెడ, కళ్లు, వీపు.. ప్రతి చోటా పొడిచాడు. ఒళ్లంతా రక్తసిక్తమైన మృతదేహంపై నిల్చుని డ్యాన్స్‌చేశాడు.

ఈ దారుణ హత్య అక్కడి సీసీటీవీలో రికార్డయింది. మంగళవారం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని వెల్‌కమ్‌ ఏరియాలోని జనతా మజ్దూర్‌ కాలనీలో చోటుచేసుకుంది. హత్య తర్వాత నిందితుడు అక్కడ గుమికూడిన జనాన్ని దగ్గరకు రాకుండా బెదిరించాడు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని బుధవారం ఉదయం అరెస్ట్‌చేశారు. చనిపోయిన 18 ఏళ్ల మృతుడికి, 16 ఏళ్ల నిందితుడికి అస్సలు ముఖ పరిచయం కూడా లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిందితుడు గత సంవత్సరంలోనూ ఇలా ఒకరిని డబ్బు దొంగలించేందుకు బెదిరించాడని తెలుస్తోంది. నిందితుడుసహా నలుగురు మైనర్లు ఒక గ్యాంగ్‌లా ఏర్పడి చిన్నపాటి చోరీలు చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మద్యం మత్తులో ఇలా విచక్షణారహితంగా ప్రవర్తించానని పోలీసుల ముందు నిందితుడు నేరం అంగీకరించాడు.  

మరిన్ని వార్తలు