కశ్మీర్‌లో ముగిసిన ఎన్‌కౌంటర్‌..

24 Nov, 2023 05:47 IST|Sakshi

లష్కరే టాప్‌ కమాండర్‌ సహా ఇద్దరు ముష్కరులు హతం

ఆస్పత్రిలో కన్నుమూసిన మరో జవాను

రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్‌కౌంటర్‌ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్‌కౌంటర్‌ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది.

బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్‌ ఎంవీ ప్రాంజల్‌(కర్ణాటక), కెప్టెన్‌ శుభమ్‌ గుప్తా(యూపీ), పారా ట్రూపర్‌ సచిన్‌ లౌర్‌(యూపీ), హవల్దార్‌ అబ్దుల్‌ మాజిద్‌(జమ్మూకశ్మీర్‌)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్‌లోని బాజిమాల్‌ ప్రాంతంలో బుధవారం ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే.

రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ ముగిసినట్లయిందని తెలిపారు.

మృతుల్లో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్‌ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు