నోట్ల రద్దుపై అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటీ?

8 Nov, 2017 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా వాటి పర్యవసానాలకు సంబంధించి ఎన్ని కథనాలనైనా రాసుకోవచ్చు. కాకపోతే సాకూల కథనాలకన్నా ప్రతికూల కథనాలే ఎక్కువగా ఉంటాయి. కోటానుకోట్ల నల్లడబ్బును దాచుకున్న అపర కుబేరులను దెబ్బతీయడం కోసం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం వారికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో తెలియదుగానీ పేద, మధ్య తరగతి ప్రజల పొట్టలను ప్రత్యక్షంగా కొట్టడమే అందుకు కారణం. ఈ నిర్ణయం కారణంగా దేశ రాజకీయాల్లో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. 2014లో బీజేపీ అఖండ విజయంతో ఎవరికివారే యమునాతేరే చందంగా విడిపోయిన మితవాద, అతివాద, మధ్యేవాద పార్టీలన్నీ పెద్ద నోట్ల రద్దుతో ఏకమయ్యాయి. పెద్ద నోట్ల రద్దయిన నేటి రోజును పాలకపక్షం బ్లాక్‌మనీ డేగా పాటిస్తుండగా, ఏకమైన విపక్షం బ్లాక్‌డేగా పాటిస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్నవారితోపాటు ఆదిలో ప్రశంసించి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నవారు, ఆది నుంచి ఇప్పటి వరకు ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. అమర్థ్యసేన్, జీన్‌ డ్రెజ్, ప్రభాత్‌ పట్నాయక్‌ లాంటి వామపక్షవాదులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌కు చెందిన అజయ్‌ షా, ఇలా పట్నాయక్, దేవాంషు దత్తా, అమిత్‌ వర్మ లాంటి ఆర్థిక నిపుణులు కూడా దీన్ని ప్రైవేటు ప్రాపర్టీ మీద దాడిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన సదానంద్‌ ధూమే ఆదిలో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. మధ్యలో నిర్లిప్తత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కల్పించిందని వాపోతున్నారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్ష, మితవాద, సెంటర్‌ పార్టీలు ఏకం కావడమే కాకుండా గురుచరణ్‌ దాస్, దీపక్‌ పటేల్‌ లాంటి వ్యాపారవేత్తలు కూడా ఒక్కటయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మొదట సమర్థించిన వారు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడానికి ప్రభుత్వ నిర్ణయం కారణమైందని విమర్శిస్తున్నారు. లారీ సమ్మర్స్, పాల్‌ కుర్గ్‌మన్, స్టీవ్‌ ఫోర్బ్స్‌ లాంటి అంతర్జాతీయ పరిశీలకులు కూడా మోదీ నిర్ణయాన్ని ఇప్పుడు విమర్శిస్తున్నారు. మోదీ ప్రభుత్వంతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్న బివేక్‌ దెబ్రాయ్, సూర్జిత్‌ భల్లా, జగదీష్‌ భగవతీ లాంటి ఆర్థిక వేత్తలు ఇప్పటికీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మూలిగే నక్కమీద తాటికాయ పండట్టు పెద్ద నోట్ల రద్దుకు జీఎస్టీ తోడవడంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ప్రజలు జీఎస్టీ అనంతరం జరుగుతున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు