అభివృద్ధే అన్ని సమస్యలకు పరిష్కారం

2 Nov, 2016 04:37 IST|Sakshi
అభివృద్ధే అన్ని సమస్యలకు పరిష్కారం

- రాష్ట్రాలు, మునిసిపాలిటీలు, పంచాయతీలు కలిసిరావాలి
- ఛత్తీస్‌గఢ్ 16వ అవతరణ దినోత్సవంలో మోదీ
- ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపబోమని వ్యాఖ్య
 
 నయా రాయ్‌పూర్/గుర్గావ్: అభివృద్ధి చెందటం ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని, తద్వారా భారత్‌ను పేదరిక రహిత దేశంగా మార్చాలని అన్నారు. ఛత్తీస్‌గఢ్ 16వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని నయారాయ్‌పూర్‌లో మంగళవారం  ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. దేశాభివృద్ధిలో నైపుణ్యానిదే కీలకపాత్ర అని.. యువత నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్నప్పుడే పేదరికం నుంచి బయటపడి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించడానికి కేంద్రం, రాష్ట్రాలు, మునిసిపాలిటీలు, పంచాయతీలు కలిసి పనిచేయాలన్నారు. ‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా పేదల అభ్యున్నతికోసం పాటుపడేలా 2016ను ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’గా జరుపుకుంటున్నాం.

పేద యువకులు సరైన అవకాశాలను అందిపుచ్చుకుని శిక్షణ, నైపుణ్యం పెంచుకుని పేదరికాన్ని దూరం చేసుకునేందుకు అడుగులు వేయాలి’ అభివృద్ధికి నిధుల విడుదలలో ఏ రాష్ట్రంపైనా వివక్ష ఉండదని మోదీ తెలిపారు. అనంతరం రాయ్‌పూర్‌లో జన్‌సంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. 320 హెక్టార్లలో నిర్మించిన జంగిల్ సఫారీ పార్క్‌ను మోదీ ప్రారంభించారు. జంగిల్ సఫారీ ఆలోచన చాలా బాగుందని ప్రశంసించారు. ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ట్రాలకు జంగిల్ సఫారీల ద్వారా వీలైనంత ఆదాయం సమకూరుతుందన్న ప్రధాని.. ఆటో రిక్షా డ్రైవర్లు, పళ్లు, చాయ్ అమ్ముకునేవారూ ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చన్నారు. నయారాయ్‌పూర్ నుంచి రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ వరకు 2కిలోమీటర్ల మేర నిర్మించిన ‘ఏక్‌తమ్ పాత్’ను రాష్ట్ర ప్రజలకు అంకితమిచ్చారు. ఇక్కడే ‘భాయ్‌దూజ్’ పండగను పీఎం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సోదరీమణుల ఆశీర్వాదం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. తల్లి, సోదరీమణుల ఆశీస్సులుంటే మనకు మరింత శక్తి వస్తుంది’ అని మోదీ అన్నారు.


 హరియాణా స్వర్ణోత్సవ వేడుకల్లో..
  హరియాణా ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుర్గావ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ఏడాదిపాటు జరిగే సంబరాలను ప్రారంభించారు. ఏడు గ్రామీణ జిల్లాలను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాలుగా, 8జిల్లాలను కిరోసిన్ వినియోగం లేని జిల్లాలుగా ప్రకటించారు. తౌ దేవీలాల్ స్టేడియంలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. చిన్నారుల లింగ నిష్పత్తి తేడా దారుణంగా ఉన్న రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చేందుకు హరియాణా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా 3 పథకాలను (దీన్‌దయాళ్ జన్ ఆవాస్ యోజన, అటోమేషన్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్ షాప్స్, కిరోసిన్ ఫ్రీ హరియాణా) మోదీ ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు