అయినవారిపైనే అకృత్యాలు

25 Dec, 2023 05:19 IST|Sakshi

96 శాతం అత్యాచార కేసుల్లో దోషులు తెలిసిన వారే

కుటుంబ సభ్యుల నుంచి సహోద్యోగుల వరకు నిందితులే

మొదటి స్థానంలో రాజస్థాన్‌

అప్రమత్తత, అవగాహనే పరిష్కారం అంటున్న పోలీసులు

ఆఫీస్‌ పని ముగించుకుని ధరణి (పేరు మార్చాం) ఇంటికెళ్లింది. భర్త పవన్‌ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నాడు. ఆ పెద్దాయన ఎవరా అనుకుంటూ గదిలోకి వెళ్లబోయింది ధరణి. ఇంతలో భర్త పవన్‌.. ‘ధరణీ.. ఈయన నీకు మావయ్య అవుతారట. చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవారట. నువ్వు ఈయన చేతుల్లోనే పెరిగావట. ఈ ఊళ్లో బంధువుల ఇంటికి వచ్చారట. నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసి చూసి పోదామని వచ్చారట’ అన్నాడు.

ధరణి లోనికి వెళ్లిపోయింది. చిన్ననాటి ఘటనలు ఆమె కళ్లముందు కదలాడాయి. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు.. పక్కింట్లో ఉండే ఆ పెద్దాయన తనను ఆడించేవాడు. ఆ ముసుగులో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. అలా రోజురోజుకు అతడి అకృత్యాలు పెరుగుతూ వచ్చాయి.

ఆ విషయాలు గుర్తొచ్చి ధరణి వళ్లు జలధరించింది. కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఆ పెద్దాయనకు భార్య కాఫీ తీసుకొస్తుందనుకున్నాడు పవన్‌. ఎంతసేపటికీ ధరణి బయటకు రాలేదు. ‘తనకు నేను గుర్తు రాలేదనుకుంట’ అంటూ ఆ పెద్దాయన మెల్లగా జారుకున్నాడు. ధరణి లాంటి బాలికలు, మహిళలు తెలిసిన వారి చేతిలోనే అత్యాచారా­లకు గురవుతున్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.

సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు.. సహోద్యోగులు.. సోషల్‌ మీడి­యా ఫ్రెండ్స్‌.. అందరూ తెలిసినవారే. కానీ.. అందరూ తమ మంచి కోరుకునే వారేనని బాలికలు, మహిళలు అనుకుంటే పొరపాటే. బాగా తెలిసిన ఆ గోముఖాల మాటున ఎన్నో వ్యాఘ్రాలుంటాయి. అవకాశం చిక్కితే.. ఒంటరిగా ఉంటే కబళించేందుకు ఏమాత్రం వెనుకాడవు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక మరోసారి ఈ విషయంలో బాలికలు, మహిళలను అప్రమత్తం చేస్తోంది.

దేశంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు వారికి బాగా తెలిసిన వారేనని నివేదిక వెల్లడించింది. ఏకంగా 96 శాతం అత్యాచార కేసుల్లో దోషులు బాధిత మహిళలకు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు, సహోద్యోగులేనని సవివరంగా నివేదించింది.

2022లో దేశంలో మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక విస్మయపరిచే వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 88 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆ నివేదిక తెలిపింది.

స్నేహం.. ప్రేమ.. పెళ్లి పేరిట
2022లో దేశవ్యాప్తంగా 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిలో 14,582 కేసుల్లో స్నేహం, ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. 248 కేసుల్లో లైంగిక దాడి / సామూహిక లైంగిక దాడి, హత్యలకు బరితెగించారు. ఈ కేసుల్లో మొత్తం 29,900 మంది దోషులుగా తేలారు. వారిలో ఏకంగా 28,873 మంది లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలకు తెలిసిన వారే అకృత్యాలకు పాల్పడటం గమనార్హం. కేవలం 1,027 మంది మాత్రమే బాధిత మహిళలకు ఏమాత్రం పరిచయం లేనివారు లేదా ఇప్పటికీ ఇంకా గుర్తించనివారు ఉన్నారు.

అత్యధికంగా రాజస్థాన్‌లో..
దేశంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన 13 రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల్లో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 5,399 మంది దోషులుగా అభియోగాలు నమోదదయ్యాయి. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారు 5,131 మంది ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో నమోదైన అత్యాచార కేసుల్లో తెలంగాణ 814 మంది నిందితులతో 12వ స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ చివరి (15వ స్థానం)లో ఉంది.

2022లో ఏపీలో అత్యాచార కేసుల్లో 621 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారే 604 మంది ఉన్నారు. వారిలో కుటుంబ సభ్యులు 39 మంది, స్నేహితులు, విడిపోయిన భర్తలు 294 మంది, కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, 
సహోద్యోగులు 271 మంది ఉన్నారు.

అవగాహన పెంపొందించాలి
బాగా పరిచయం ఉన్నవారే బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారిలో కుటుంబ సభ్యుల నుంచి సహోద్యోగుల వరకు ఉంటున్నారు. బాలికలు, మహిళల్లో సరైన అవగాహన పెంపొందిచడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ప్రధానంగా బాలికలతో తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ సమయం గడపాలి.

లైంగిక దాడులకు గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలి. బ్యాడ్‌ టచ్, గుడ్‌ టచ్‌ గురించి తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తే వెంటనే ప్రతిఘటించేలా.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలనే అవగాహన పెంపొందించాలి.

సోషల్‌ మీడియాలో స్నేహాలు, ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లలో విషయంలో తగిన పరిధిలో ఉండటం, అప్రమత్తంగా 
ఉండటం చాలా అవసరం. ఇబ్బందికర పరిస్థితులు తెలెత్తితే వెంటనే రక్షణ ఎలా పొందాలన్నది బాలికలకు, మహిళలకు తెలియజేయాలి. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలి. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ 

>
మరిన్ని వార్తలు