'ప్లీజ్‌.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు'

4 Jan, 2018 15:53 IST|Sakshi

సాక్షి, మీరట్‌ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్‌ అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత శ్లోకాలు చెప్పడం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

'నేను కృష్ణుడు వేషం వేసి, భగవద్గీత శ్లోకాలు చదివినంత మాత్రాన ఇస్లాం బలహీనమైనదని అర్ధం కాదు. అలా అనుకునే వారితో నేను ఏకీభవించను. ముస్లిం మత పెద్దలు నాకు వ్యతిరేకంగా ఫత్వా కూడా విడుదల చేశారు. అందుకే ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు' అని అలియా వేడుకుంది. గతంలో కూడా తాను చేసిన పని ఏ ఒక్క మత విశ్వాసాన్నిగానీ, గుర్తింపునకుగానీ హానీ కలిగించదని చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది (2017) డిసెంబర్‌ 30న జరిగిన ఓ కార్యక్రమంలో అలియా కృష్ణుడి వేషం వేసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు కూడా చదివింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు