పుణేలో తాగునీటికి కటకట

16 Jul, 2014 23:17 IST|Sakshi

 పింప్రి, న్యూస్‌లైన్: వర్షాకాలం మొదలై ఇన్నిరోజులైనా సరైన వర్షాలు కురవకపోవడంతో పుణే నగరంలో తాగునీటి సమస్య మొదలైంది. దీంతో నీటిని బ్లాక్‌లో కొని తాగాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అవసరాన్ని బట్టి ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లు ధరలను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నా అడిగే నాధుడే కరువయ్యాడు. నగరంలో నీటి కోతలు విధించడంతో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కార్పొరేషన్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కార్పొరేటర్లు, ప్రజలు ఒత్తిడి పెంచుతున్నారు. నగరంలో కార్పొరేషన్ ద్వారా సుమారు 150 ట్యాంకర్లను నడుపుతుండగా, కాంట్రాక్టు పద్ధతిలో కొన్ని వందల సంఖ్యలో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి.

 కార్పొరేషన్‌కు డిమాండ్ మేరకు ట్యాంకర్లను అందించడం సాధ్యం కావడం లేదు. దీంతో నీటిని అందించేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు నీటి సరఫరా బాధ్యతలను అప్పగించారు. కార్పొరేషన్ నిర్ణయించిన ధరల ప్రకారం వీరు రూ.10 వేల లీటర్ల నీటికి రూ.300, 10 నుంచి 15వేల లీటర్లకు గాను రూ.600 వసూలు చేయాల్సి ఉండగా 15 వేల లీటర్ల ట్యాంకు నీటికి డిమాండ్‌ను బట్టి రూ.800 నుంచి 1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ఇదిలా ఉండగా, కార్పొరేషన్ ప్రస్తుతం పర్వతి, పద్మావతి, నగర్ మార్గం, వడగావ్‌శేరి, ఎన్‌ఎన్‌డీటీలతోపాటు మరో ఏడు కేంద్రాల నుంచి నీటిని ట్యాంకర్లకు అందజేస్తోంది. అయితే కాంట్రాక్టర్లు ఈ పాయింట్ల నుంచి కాకుండా బయటి ప్రాంతాల్లో నీటిని నింపుకొని బ్లాక్‌లో అధిక రేటుకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. వడగావ్‌శేరి, లోహ్‌గావ్, ఖరాడి, విమాన్ నగర్, కాత్రజ్, వార్జే, పౌడ్, పాషాణ్, కొండ్వా, ముండ్వా, హడప్సర్‌తోపాటు అనేక ఉప నగర పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్లకు అధిక డిమాండ్ ఉంది.

 కార్పొరేషన్ నీటి కేంద్రాలలో ట్యాంకర్లకు జీపీఎస్...
 నీటిఎద్దడి నేపథ్యంలో దుర్వినియోగాన్ని నివారించేందుకు కార్పొరేషన్ ట్యాంకర్లతోపాటు ప్రైవేట్ ట్యాంకర్లు ఎన్ని పర్యాయాలు నీటిని నింపుకున్నాయని తెలుసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు ఆయా కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చారు.  ఈ యంత్రాలు ఉన్న ట్యాంకర్లకు మాత్రమే కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లోకి అనుమతిస్తోంది.

మరిన్ని వార్తలు