రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ ఇ-రిక్షా

21 Jun, 2014 02:28 IST|Sakshi
రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ ఇ-రిక్షా

కొందరికి అవి జీవనాధారం: మరి కొందరికి ఓ బెడద
న్యూఢిల్లీ: బన్సీలాల్ రిక్షా తొక్కి నెలకు ఐదువేల రూపాయలు సంపాదించేవాడు. ఇప్పుడు కాళ్లతో తొక్కే రిక్షాకు బదులుగా బ్యాటరీతో నడిచే దానికి మారాడు. ఇప్పుడు అతని ఆదాయం నెలకు రూ.15వేలపైనే. రాజధాని నగరంలో ఇ-రిక్షాల ఆగమనం ఎందరికో తిండి పెడుతూ, అటు పేదలు ఇటు పర్యావరణవేత్తల ఆదరణ చూరగొంటున్నాయి. ఇదివరకు ‘చేతికి-నోటికి’ అన్న చందంగా బతుకు గడిపిన రిక్షా కార్మికులు ఇప్పుడు కొంత మెరుగైన జీవనం గడుపుతున్నామంటున్నారు. ఇ-రిక్షాలకు మారిన ఎందరో కార్మికులు ఇక తమ జీవనం సుఖప్రదం కాగలదని భావిస్తున్న తరుణంలోనే పూర్వ యూపీఏ ప్రభుత్వం వాటిని చట్ట వ్యతిరేకమైనవిగా ప్రకటిస్తూ ఏప్రిల్ 24న నోటిఫికేషన్‌జారీ చేసింది.
 
నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల అనంతరం స్పందించిన రవాణా అధికారులు ఇ-రిక్షాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని సుమారు 30వేల ఇ-రిక్షాల కార్మికులు, వారి కుటుంబాలు భయాం దోళనకు గురయ్యారు. అయితే నూతన ప్రభుత్వంలో రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతవారం చేసిన ప్రకటన ఈ కుటుం బాలకు ఊపిరిలూదింది. రాజధాని నగరంలో 30 వేలకు పైగా ఇ-రిక్షాలు తిరుగుతున్నాయని బ్యాట రీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అనుజ్ శర్మ చెప్పారు.

ఈ సంఖ్యకు కార్మికుల కుటుంబాలను కూడా చేరిస్తే కనీసం 1.20 లక్షల మంది ఇ-రిక్షాలపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ‘‘ఇ-రిక్షాను కొన్నప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. రోజంతా సైకిల్‌రిక్షా తొక్కి సాయంత్రానికి అలసిపోయే వాడిని. ఇప్పుడు ఈ కొత్త రిక్షాలో ఎక్కువ మందిని ఎక్కిం చుకోవచ్చు, ఎక్కువగా సంపాదించవచ్చు’’ అని 40 ఏళ్ల బన్సీలాల్ పేర్కొన్నారు. పర్యావరణ వేత్తలు సైతం ఇ-రిక్షాలను ‘మాధ్యమిక’ ప్రజా రవాణా వ్యవస్థగా అభివర్ణించా రు. వీటి నుంచి ఎటువంటి కాలుష్య ఉద్గారాలు వెలువడవని పేర్కొన్నారు. అయితే వీటిని నడిపే డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రతాపరమైన మార్గదర్శకాలు రూపొందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు.

‘‘కాలుష్యాన్ని, కార్ల వినియోగాన్ని తగ్గించడంలో ఈ నూతన రవాణా సాధనం ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అయితే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొం దించాలి’’ అని శాస్త్ర, పర్యావరణ కేంద్ర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అరుంధతీ సీజెల్ సూచించారు.

ఇ-రిక్షాలు కామన్వెల్త్ క్రీడలకు ముందు 2010 లో ఢిల్లీలో మొదటిసారిగా దర్శనమిచ్చాయి. నగరమంతటా అవి విస్తరించడానికి మూడేళ్లు పట్టింది. ఢిల్లీ మెట్రో ఫీడర్ బస్సుల వైఫల్యం కారణంగానే ఇ-రిక్షాలు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి తమ నివాస ప్రాం తాలకు చేరవేసేందుకు ఫీడర్ బస్సులను ప్రవేశపెట్టారు. అయితే అవి సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇ-రిక్షాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతకాలం క్రితం వరకు బస్తీల వరకే పరిమితమైన ఇ-రిక్షాలు ఇప్పు డు రద్దీగా ఉండే రోడ్లు, ఫ్లైఓవర్లపై పరుగులు తీస్తున్నాయి.

శిక్షణలేని డ్రైవర్లు వాటిని దురుసుగా నడుపుతుండడంతో ఇతర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రంతా బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు పని చేస్తుందని, గంట కు 20-30 కిలోమీటర్ల వేగంతో వెళుతుం దని బన్సీలాల్ చెప్పారు.ఇ-రిక్షా ఖరీదు రూ.85వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంది. ఇరుకు సందుల్లో కూడా దూసుకుపోతుంది.
 
రవాణా మంత్రి గడ్కరీ ప్రకటన నేపథ్యంలో నగర మున్సిపల్ కార్పొరేషన్లు ఇ-రిక్షాలను ఈ నెలాఖరుకు క్రమబద్ధం చేయాలని నిర్ణయించాయి. వీటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేకపోవడం సమస్యగా మారిందని ట్రాఫిక్ పోలీసులంటున్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు డ్రైవర్లకు జరిమానాలు విధిస్తున్నామన్నారు. ఇ-రిక్షాల డిజై న్ లోపాలతో కూడి ఉందని, శిక్షణ లేని డ్రైవర్ల వల్ల ప్రయాణికులకు ప్రమాదకరమని రవాణా విభాగం అధికారి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు