సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ ఊరట

8 May, 2019 10:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్‌ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ విధించిన 72 గంటల నిషేధాన్ని ఆమె ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై ప్రజ్ఞా సింగ్‌కు బుధవారం ఈసీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ప్రజ్ఞా సింగ్‌ ప్రచారంపై ఈసీ 72 గంటలు నిషేధం విధించినా ఆమె దేవాలయాలు సందర్శించడం, భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం వంటి చర్యలతో ఈసీ ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఆమె తన ఉద్యమాల గురించి కరపత్రాలను పంచారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

దీనిపై ఈసీ ఆమెను వివరణ కోరగా ఈ ఆరోపణలను ప్రజ్ఞా సింగ్‌ తోసిపుచ్చారు. తన తరపున కరపత్రాలు ఎవరు పంచారో తనకు తెలియదని బదులిచ్చారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసం, మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే మరణంపై ప్రజ్ఞా సింగ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆమె 72 గంటల పాటు ప్రచారం చేయరాదని నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు