ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుకు యాప్‌

4 Jul, 2018 01:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో అక్రమాలపై రహస్యంగా ఫిర్యాదు చేసేందుకు ఓటర్ల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) రూపొందించింది. ఈ యాప్‌ను వినియోగించి ఎన్నికల సమయంలో విద్వేష ప్రసంగాలు చేస్తున్న, అక్రమంగా డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల వీడియోలు, ఫొటోలను చిత్రీకరించి రహస్యంగా ఈసీకి పంపవచ్చు. ఇంటర్‌నెట్‌తో నడిచే యాప్‌నకు సీవిజిల్‌ (సిటిజెన్స్‌ విజిల్‌) అని ఈసీ పేరు పెట్టింది. త్వరలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులోకి రానుంది.

ఈ ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యాప్‌ను తొలిసారి వినియోగించనున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడే ఈ యాప్‌ పని చేస్తుంది. ‘ఎన్నికల్లో జరిగే అక్రమాల గురించి మాకు తెలియజేసేలా ఫిర్యాదుదారులను ప్రోత్సహించేందుకు.. వారి గుర్తింపు, ఫోన్‌ నంబర్‌ను గోప్యంగా ఉంచుతాం’ అని ఈసీ తెలిపింది.

‘ఫిర్యాదుదారులు పంపే ఫొటోలు, వీడియోలు జియోగ్రాఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ద్వారా ఆటోమేటిక్‌గా ట్యాగ్‌ అవుతాయి. ఈ సమాచారం ఆధారంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘ న జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా నిఘా బృందాలకు ఆదేశాలు జారీ చేస్తాం’ అని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓపీ రావత్‌ తెలిపారు. ‘ఈ యాప్‌ ద్వారా వీడియో, ఫొటోలను చిత్రీకరించి పంపే వారి ఫోన్లలో ఆయా వీడియోలు, ఫొటోలు సేవ్‌ కావు. చిత్రీకరించిన ఐదు నిమిషాల్లోగా స్థానికంగా ఈసీ నియమించిన క్షేత్రస్థాయి బృందానికి పంపాలి. దీంతో ఆ బృందాలు వెంటనే సంబంధిత ప్రాంతానికి వెళ్తాయి. ఫిర్యాదు నిజమైతే.. ఫొటో లేదా వీడియో పంపిన ఫిర్యాదుదారుకు 100 నిమిషాల్లోగా సమాచారం వెళ్తుంది’ అని డిప్యూటీ ఈసీ సందీప్‌ సక్సేనా తెలిపారు.

>
మరిన్ని వార్తలు