భారత్ను వెలుగురేఖలా కీర్తిస్తున్నాయి: మోదీ

27 Feb, 2016 18:50 IST|Sakshi
భారత్ను వెలుగురేఖలా కీర్తిస్తున్నాయి: మోదీ

బెలగావి: తమ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి దేశవ్యాప్తంగా ఉన్న అవినీతితో ప్రజలు విసిగెత్తి ఉన్నారని.. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కర్నాటకలోని బెలగావిలో శనివారం రైతుసభలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. ప్రపంచదేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో సైతం భారత్ మెరుగైన వృద్ధిరేటు సాధించిందన్నారు. ప్రపంచ దేశాలు భారత్ను వెలుగురేఖలా కీర్తిస్తున్నాయని మోదీ తెలిపారు.

వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవారంగాలను అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. రైతులకు సరైన నీటి సౌకర్యాన్ని కల్పిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపిన ప్రధాని.. ఇందుకోసం ప్రవేశపెట్టిన క్రిషీ సించాయ్ యోజన మంచి ఫలితాలను ఇస్తోందని స్పష్టం చేశారు. నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, వాటర్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ అన్నారు.

నఖిలీ ఎరువులను తమ ప్రభుత్వం అదుపు చేసిందని మోదీ తెలిపారు. కృత్రిమ ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు వాడాలన్నారు. ఈ సందర్భంగా తన మిత్రుడు అనంత్ కుమార్ వేప మిశ్రమాలతో కూడిన ఎరువులతో మంచి ఫలితాలు సాధించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ విధానం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని మోదీ వెల్లడించారు. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం సైతం మంచి ఫలితాలను ఇస్తోందని ప్రధాని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు