ఖతర్‌లో మరణశిక్ష కేసు.. బాధితులను కలిసిన భారత రాయబారి

7 Dec, 2023 20:06 IST|Sakshi

ఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్‌ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ.. భారత్‌ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు.

సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నావికాదళ అధికారులకు న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 3ను వారిని భారత్‌ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు.

అదేవిధంగా.. ఇటీవల కాప్‌ సదస్సులో భాగంగా దుబాయ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు.

>
మరిన్ని వార్తలు