పౌర హక్కుల నేతల అరెస్టు: పోలీసుల సంచలన ఆరోపణలు

31 Aug, 2018 16:59 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఏడీజీ పరమ్‌ బీర్‌ సింగ్‌

ముంబై: దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్ట్‌ చేసిన మహారాష్ట్ర పోలీసులు మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ హింసాకాండకు సంబంధించి దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లపై దాడులు, అరెస్టులపై చెలరేగిన విమర్శలు, కోర్టు మొట్టికాయల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం స్పందించారు. మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్ జనరల్ (లా అండ్‌ ఆర్డర్‌) పరమ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్‌ గాంధీ హత్య తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే తాము ఈ అరెస్టులు చేశామన్నారు. మావోయిస్టులు, పౌర హక్కుల నేతలకు మధ్య జరిగిన  ఉత్తరప్రత్యుర్తాలకు సంబంధించిన లేఖలు తమకు లభించాయన్నారు.  

ఈ లేఖలను ఏడీజీ తన ప్రెస్‌మీట్‌లో మీడియా ముందు ప్రదర్శించారు. ఇప్పటివరకు తాము సేకరించిన లేఖలు కొన్ని వేలు ఉన్నాయనీ, అందులో ముఖ్యమైన వాటినే మీడియా ముందు ఉంచుతున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కుట్రలకు పౌర హక్కుల నేతలు సహకరించారన్నారని ఈ లేఖలు స్పష్టం చేస్తున్నాయని పరమ్‌ బీర్‌ సింగ్‌ చెప్పారు. ముఖ్యంగా సుధా భరద్వాజ్‌ కామ్రేడ్‌ ప్రకాశ్‌కు ఒక లేఖ రాశారనీ, హక్కుల దుర్వినియోగంపై సోషల్‌ మీడియాను ఎలా వాడుకోవాలో అందులో రాశారన్నారు. శత్రువులకు వ్యతిరేకంగా తమ పని మొదలైందని  కూడా ఆమె రాశారని ఏడీజీ  పేర్కొన్నారు. మావోయిస్టు నేతలు, ఇతర సంస్థలతో కలిపి మయన్మార్‌లో రహస్యంగా సమావేశమయ్యారనీ, జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదులు, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీతో భారీ ఎత్తున కుట్ర చేశారని, గ్రెనేడ్‌ లాంచర్స్‌ లాంటి ఆయుధాల‌ కొనుగోలుకు నిధులు సేకరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీమా కోరేగావ్‌ అల్లర్లలో అరెస్టయిన  కేడర్‌  కోసం మావోయిస్టు సెంట్రల్ కమిటీ రూ.15 లక్షల  మంజూరు చేసిందన్నారు.
 
2017, డిసెంబర్ 31వ తేదీన బీమా కోరేగావ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన కేసును జనవరి 8వ తేదీన నమోదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్ల కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఏడీజీ తెలిపారు. కాగా, భీమా కోరెగావ్ హింసాకాండ కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ పెరీరా, గౌతమ్ నవ్‌లఖా, వెర్నాన్ గొంజాల్విస్, సుధా భరద్వాజ్ లను పుణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు  తదుపరి విచారణ తేదీ (సెప్టెంబరు 6) వరకు వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని బుధవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరంతా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు