ఆరుగాలం శ్రమించి చి'వరి'కి నిప్పు

3 Nov, 2017 12:12 IST|Sakshi

వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని అన్నదాత బతుకు నానాటికీ అధ్వానంగా తయారవుతోంది. ఏటికేడాది అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి రైతుల కంట కన్నీరొలికిస్తున్నాయి. దొరికిన దగ్గర అప్పులు తెచ్చి, ఇంటిలో ఉన్న కాడికి బంగారాన్ని కుదువ పెట్టి ఆరుగాలం స్వేదం చిందించి పంట పొలాన్నే నమ్ముకునే రైతన్న ఏటా ఏదోలా దగా పడుతున్నాడు. రాయగడ జిల్లాకు చెందిన ఓ రైతు కష్టం, పెట్టుబడి అక్కరకు రాకుండా పోవడంతో కడుపుమండి పండించిన పంటను తగులబెట్టాడు. 
 
రాయగడ: రాయగడ జిల్లా గుణుపురం సబ్‌డివిజన్‌ రామన్నగుడ సమితి గజ్జిలిగుడ గ్రామానికి చెందిన రైతు ఎన్‌.అనంతరావు తన 8ఎకరాల వరిపంటను గురువారం తగులబెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనంతరావు 8 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా పంట కోత దశకు వచ్చే సమయానికి  సరైన ధాన్యం పండకుండా పొల్లు ధాన్యం పండాయి. అలాగే ధాన్యపు పంటకు బీబీహెచ్, చొకొడొ పురుగు పట్టడంతో వ్యవసాయం పూర్తిగా నష్టపోయాడు. ఇప్పటికే అనంతరావు తన బంగారాన్ని గుణుపురం ఇండియన్‌ బ్యాంక్‌లో కుదువ పెట్టాడు. అలాగే కుజేంద్రి బ్యాంక్‌లోను, రామన్నగుడలో వ్యవసాయ రుణాలు చేసి మదుపులు పెట్టాడు. వరికి పురుగు పట్టడంతో వ్యవసాయశాఖ అధికారుల సలహా తీసుకుని పురుగు మందులను వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో  మనస్తాపం చెంది  పంటకు నిప్పు అటించాడు. విషయం తెలుసుకున్న  గ్రామప్రజలు నిప్పును ఆర్పే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే
ఈ ఘటనపై రామన్నగుడ బీడీఓ గులాంమక్సద్, ఇతర అధికారుల బృందం ఘటటాస్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఈ సందర్భంగా రైతు అనంతరావు మాట్లాడుతూ  ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అధికారుల ముందు వాపోయాడు. దీంతో బీడీఓతో సహా వ్యవసాయ శాఖ అధికారులు అనంతరావుకు కీటక నాశన మందులు సరఫరా చేసిన మందుల దుకాణంపై దాడులు చేయగా ఆ పురుగు మందులు నకిలీవని తెలియవచ్చింది. దీనిపై బీడీఓ విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదిక పంపనున్నారు.

మరిన్ని వార్తలు