దేశ రాజధానికి పోటెత్తిన రైతులు

29 Nov, 2018 18:40 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : రుణ మాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు సహా తమ డిమాండ్ల సాధనకు రెండు రోజుల పాటు నిరసన తెలిపేందుకు దేశవ్యాప్తంగా రైతులు గురువారం వేలాదిగా రాజధానికి తరలివచ్చారు. రాంలీలా మైదాన్‌ నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌ వరకూ శుక్రవారం జరిగే ర్యాలీకి ఏపీ, తెలంగాణ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్‌, యూపీ సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధాని చేరుకున్నారు.

రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికుల సంఘాలతో కూడిన అఖిల భారత రైతు సంఘర్ష్‌ సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు రైతులు బస్సులు, రైళ్లు సహా పలు మార్గాల్లో రాజధానికి పోటెత్తారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలు, పంజాబ్‌, హర్యానా, యూపీ నుంచి రైతులు గురువారం ఉదయం నుంచే ఢిల్లీకి చేరుకున్నారని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.

నగరం నలుమూల నుంచి రాంలీలా మైదాన్‌కు రైతులు తరలివస్తుండటంతో ఢిల్లీలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్షకు పైగా రైతులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు రైతు ర్యాలీ సందర్భంగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను సిద్ధం చేశారు. ట్రాక్టర్లు, ట్రక్కులను నగరంలోకి అనుమతించమని ఘజియాబాద్‌ ఎస్పీ ఉపేంద్ర అగర్వాల్‌ స్పస్టం చేశారు.

అడ్డుకుంటే అంతే..
తమ ర్యాలీని అడ్డుకుంటే పార్లమెంట్‌ వరకూ నగ్న ప్రదర్శన చేపడతామని తమిళనాడుకు చెందిన రైతులు హెచ్చరించారు. ఢిల్లీకి చేరుకున్న 1200 మంది సభ్యులతో కూడిన రైతుల బృందం శుక్రవారం నాటి ర్యాలీకి సన్నద్ధమైంది. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు తమ సహచరుల పుర్రెలతో వీరు దేశ రాజధానికి చేరుకోవడం అలజడి రేపుతోంది. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న ఎనిమిది మంది రైతుల పుర్రెలతో గత ఏడాది జంతర్‌ మంతర్‌ వద్ద వీరు నిరసనలకు దిగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ సంఘానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకుంటున్నారని రైతు సంఘం నేత అయ్యకన్ను చెప్పారు. గత ఐదేళ్లుగా తాము కరువును ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు రైతుల కోసం చేస్తున్నదేమీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు