అచ్చం సైనికుల్లాగే.. పొట్టి క్రాఫుతో!

20 Sep, 2016 08:13 IST|Sakshi
అచ్చం సైనికుల్లాగే.. పొట్టి క్రాఫుతో!

భారత సైనిక శిబిరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు అచ్చం భారతీయ సైనికుల్లాగే కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. శుభ్రంగా గెడ్డం గీసుకోవడంతో పాటు, జుట్టును కూడా పొట్టిగా కత్తిరించుకున్నారు. వాళ్లంతా 20 ఏళ్ల దగ్గర వయసులోనే ఉన్నారని వాళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. ఎముకల మందం, బరువు ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. దాడి జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదుల మృతదేహాలను ఖననం చేశారు. వాళ్ల ప్రేవులు, గుండె భాగంలో మొత్తం 169 బుల్లెట్లు దిగాయి. వాళ్ల ఆయుధాల మీద కూడా బుల్లెట్ల వల్ల ఏర్పడిన రంధ్రాలు కనిపించాయి. ఉగ్రవాదుల వద్ద ప్రోటీన్లు బాగా ఎక్కువగా ఉండే 26 చాక్లెట్ రాపర్లు, ఆరు రెడ్ బుల్ క్యాన్లు, మూడు ఖాళీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కొన్ని మందులు కనిపించాయి. అన్నింటి మీద 'మేడిన్ పాకిస్థాన్' అనే ముద్రలు స్పష్టంగా ఉన్నాయి.

యురి ప్రాంతంలో గొర్రెలు కాసుకునే ముగ్గురు వ్యక్తులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. ఉగ్రవాదులు ఈ ప్రాంతానికి చేరుకోడానికి వాళ్లు సహకరించారన్న అనుమానంతో వారిని ప్రశ్నించారు. ఎల్‌ఓసీకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్వామా, రఫియాబాద్, ముజఫరాబాద్ ప్రాంతాల లొకేషన్లతో కూడిన జీపీఎస్ పరికరాన్ని కూడా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ముజఫరాబాద్ నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది. జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ తరచు ఇక్కడి ప్రజలకు ఆడియో క్లిప్‌ల ద్వారా సందేశాలు పంపుతుంటాడు. ఉగ్రవాదులకు సాయం చేసేలా వారిని రెచ్చగొడుతుంటాడు. జీపీఎస్‌లో ముందుగానే ఫీడ్ చేసిన వివరాలను బట్టి చూస్తే.. ఉగ్రవాదులు దాడికి ముందు పాకిస్థాన్‌లో ఉన్న విషయం కూడా స్పష్టమవుతోందని ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు