‘పోస్కో’ అంటే పూసుకున్నారు..

22 Mar, 2017 16:23 IST|Sakshi
‘పోస్కో’ అంటే పూసుకున్నారు..

భువనేశ్వర్‌: ప్రపంచానికి సుపరిచితమైన ‘పోస్కో’ పేరు ఒకప్పుడు భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో మారుమోగింది. పోస్కో పేరు చెప్పగానే ఇటు ఒడిశా రాష్ట్రంతోపాటు యావత్‌ భారతదేశం పులకించి పోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ పోస్కో కంపెనీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఉక్కు పరిశ్రమను పెట్టబోతోందని భారత్, తద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఒడిశా రాష్ట్రం ఉప్పొంగిపోయాయి. అడిగిందే తడువుగా వెనకాముందు అలోచించకుండా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పోస్కో కంపెనీతో 2005లో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామంటూ కేంద్రం ప్రభుత్వ దీవించింది. 52 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్న తొలి విదేశీ కంపెనీ పోస్కో  కావడమే అందుకు కారణం.

పర్యావరణ అవరోధాలు, ప్రజల అవిశ్రాంత పోరాటం, కొత్తగా వచ్చిన చట్టాల నిబంధనలు పన్నేండేళ్ల ‘పోస్కో ప్రాజెక్టు’కు తెరదించాయి. చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రతిపాదిత ఉక్కు ప్రాజెక్టు నుంచి పోస్కో తప్పుకున్నట్లు ఒడిశా రాష్ట్ర పరిశ్రమల మంత్రి దేవీ ప్రసాద్‌ మిశ్రా శనివారం నాడు ప్రకటించారు. భూమిపైనున్న తమ హక్కుల కోసం 12ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న పోస్కో వ్యతిరేక రైతులకు ఇది నైతిక విజయమే కావచ్చు. పర్యావరణ పరిరక్షకులకు ఉపశమనమూ కలిగించవచ్చు. జరిగిన అపార నష్టానికి ఎవరు వెలగట్టగలరు? అందుకు ఎవరు మూల్యం చెల్లిస్తారు? వస్తాయనుకున్న వేలాది ఉద్యోగాలు రాకపోగా, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో సగం మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు.

ప్రాజెక్టు ఏర్పాటు పేరిట కాజు, ఇతర పండ్ల వక్షాలతోపాటు లక్షలాది వట వృక్షాలు నేల కూలాయి. ధ్వంసమైన తమలపాకు తోటలు రైతుల నోట్లో మట్టి కొట్టాయి. సగానికిపైగా అటవి ప్రాంతం ఎడారిగా మారిపోయింది. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారు? ఎవరిదీ పాపం?!
ఒడిశాలోని జగత్‌సింగ్‌ పూర్‌ జిల్లాలో పోస్కో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు 4004 ఎకరాల భూమి అవసరం అవుతుందని కంపెనీ అధికారులు అంచనా వేశారు. చేతిలో గుంట భూమి కూడా లేకుండానే సులువుగా ఆ మొత్తం భూమిని సేకరించి అప్పగిస్తామని రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి కార్పొరేషన్‌ హామీ ఇచ్చింది.

ముందుగా 3,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూసింది. చట్టాల అవాంతరాల కారణంగా కేవలం 17,00 ఎకరాలను మాత్రమే సేకరించగలిగింది. తమలపాకు తోటల ద్వారా నెలకు కనీసం 20 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న రైతుల్లో ఎవరు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు రాలేదు. భ్రమలు, ప్రలోభాలతోపాటు బెదిరింపులు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా దాదాపు వెయ్యి ఎకరాలను సేకరించింది. మొత్తం 2700 ఎకరాలను సేకరించగా, అందులో 17,00 ఎకరాలను కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆ ప్రాంతాన్ని కంపెనీ చదును చేసింది. మొదటి దశకింద 80 లక్షల టన్నుల యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు.

అవగాహన ఒప్పందం మేరకు ఉక్కు కర్మాగారం నిర్వహణకు ఓ ఓడ రేవును, ఖనిజ గనులను పోస్కోకు అప్పగించాల్సి ఉంది. సమీపంలోని పారదీప్‌ రేవును కంపెనీకి అప్పగించాలనుకున్నారు. అపార గనులున్న సుందర్‌గఢ్‌ ప్రాంతం లీజు దక్కేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశోధనలు జరిపిన కంపెనీ అధికారులు అతి తక్కువ ధరకు ఇనుప ఖనిజాన్ని దక్కించుకోవచ్చని ఆశించారు. గనుల తవ్వకాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమాలను అరికట్టడంలో భాగంగా 2013లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర గనుల అభివద్ధి, నియంత్రణా చట్టాల్లో  మార్పులు తీసుకొచ్చింది. కచ్చితంగా వేలం పాట ద్వారా ఎక్కువ బిడ్డింగ్‌ వేసిన వాళ్లకే గనులను అప్పగించడం సవరించిన దాట్లో ముఖ్యాంశం.

2015లో మళ్లీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన పోస్కో అధికారులు బిడ్డింగ్‌ ద్వారా గనులను దక్కించుకొని ప్రాజెక్టును నిర్మించడం అర్థరహితమని భావించారు. అప్పుడే ప్రాజెక్టును నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే వారు తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయడానికి రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు సేకరించిన భూమిని తమ వద్దనే ఉంచుకుంటామని, దాన్ని భవిష్యత్తులో వచ్చే పరిశ్రమల కోసం ఉపయోగిస్తామని రాష్ట్ర మంత్రి మిశ్రా చెప్పగా, పోస్కో నిష్క్రమిస్తే అంతకన్నా గొప్ప కంపెనీలను పిలుస్తామని కేంద్ర బొగ్గు, విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ తాజాగా ప్రకటించారు. తొలి ప్రాజెక్టు వైఫల్యం ద్వారా ఇంతకు వీరు ఏమి నేర్చుకున్నట్టు?

మరిన్ని వార్తలు