రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్‌ వద్ద హల్‌చల్‌!

2 Nov, 2023 16:08 IST|Sakshi

రూ.2 వేల నోట్ల డిపాజిట్‌ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్‌ 7 వరకు అందించాయి. ఆ తర్వాత అక్టోబర్‌ 8 నుంచి ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఇంకా తమ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నవారు ఆర్బీఐ కార్యాలయాలకు వచ్చి మార్చుకుంటున్నారు. అయితే కొంత మంది కిరాయి వ్యక్తులు క్యూలైన్లలో హల్‌చల్‌ చేస్తున్నారు.

ఈ మేరకు మీడియాలో రావడంతో ఒడిశా పోలీస్‌ శాఖలోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు భువనేశ్వర్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి చేరుకున్నారు. రూ. 2 వేల నోట్లు మార్చుకునేందుకు ఇక్కడి క్యూ లైన్లలో నిలబడిన వ్యక్తులను.. తమ నోట్లే మార్చుకుంటున్నారా లేదా వేరొకరి కోసం వచ్చారా అని ఆరా తీశారు.

ఒక్కొక్కరికి రూ.300!
నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐ కార్యాలయం వద్ద క్యూలో ఉన్నంటున్న వారిలో కొంతమంది వేరొకరి నోట్లను మార్చడం కోసం క్యూలో నిల్చుంటున్నారని, ఇందు కోసం రూ.300 కిరాయి తీసుకుంటున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. 

ఆర్బీఐ కౌంటర్‌లో రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు కొంతమంది కిరాయి వ్యక్తులు వస్తున్నట్లు మీడియా కథనాలు రావడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు ప్రత్యేక బృందానికి చెందిన ఒక అధికారి తెలిపారు. నోట్లను మార్చుకోవడానికి క్యూలో నిలబడిన వ్యక్తుల ఆధార్ కార్డులను పరిశీలించామని, వారి వృత్తి గురించి కూడా అడిగామని చెప్పారు.

క్యూలో చాలా మంది క‌చ్చితంగా 10 రూ. 2,000 నోట్లను ప‌ట్టుకుని క‌నిపించార‌ని మ‌రో అధికారి తెలిపారు. కాగా ఆర్బీఐ కార్యాలయాల కౌంటర్లలో ఒక్కొక్కరు గరిష్టంగా 10 రూ.2 వేల నోట్లు అంటే రూ.20 వేలు మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో క్యూలో నిల్చున్న వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా అధికారులు తనిఖీ చేశారు.

అయితే ఈ వ్యవహారంపై ఒడిశా పోలీస్‌ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు తనను కలవలేదని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఎస్‌పీ మహంతి తెలిపారు. క్యూలో అనుమానిత వ్యక్తులను వారు ఆరా తీసి ఉండవచ్చని, దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థ వివరణ కోరడానికి వస్తే పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు