ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి.. 

3 May, 2020 16:54 IST|Sakshi
పులితో పోరాడుతున్న అటవీ అధికారులు

లక్నో : ప్రజలపై దాడి చేసి, భీభత్సం సృష్టించిన పెద్దపులిని అడవిలోకి పంపటానికి తీవ్రంగా శ్రమించారు అటవీ అధికారులు. కంచె ఉన్న ట్రాక్టర్‌పై దానితో పోరాడి విజయం సాధించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అటవీ ప్రాంతం నుంచి పిలిభిత్‌‌లోకి వచ్చిన పెద్దపులి ప్రజలపై దాడికి దిగింది. దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు దాన్ని క్షేమంగా అడవిలోకి పంపాలనుకున్నారు. కంచె ఉన్న ట్రాక్టర్‌పై పెద్దపులిని ఎదుర్కొన్నారు. తీవ్ర ప్రయాస అనంతరం చేసేదేమీ లేక పులి తోక ముడిచి అడవిలోకి వెళ్లిపోయింది. 

ఇందుకు సంబంధించిన ఫొటోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కశ్వన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కశ్వన్‌ స్పందిస్తూ.. ‘‘పులి ఎంత పెద్దగా ఉందో చూడండి. ట్రాక్టర్‌ మీదకూర్చుని ఉంది. పిలిభిత్‌‌లో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు శ్రమించి దాన్ని అడవిలోకి పంపేశార’’ని పేర్కొన్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి గత కొద్దిరోజులుగా నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పులితో పోరాడిన ఆ ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులని మొదట వార్తలు వెలువడ్డప్పటికి అది అవాస్తవమని తేలింది. ఆపరేషన్‌లో భాగంగానే అటవీ అధికారులు కంచె ఉన్న ట్రాక్టర్‌తో అక్కడికి చేరుకున్నారని వెల్లడైంది.

మరిన్ని వార్తలు