సుమలతను ఓడించేందుకు ఇన్నికుట్రలా?!

28 Mar, 2019 09:29 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో దూకుడు పెంచుతున్నాయి. ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే కసితో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలోని మండ్య పార్లమెంట్‌ స్థానంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడి నుంచే సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ తొలిసారి పోటీ చేస్తుండగా.. దివంగత నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్‌ భార్య సుమలత కూడా ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. అయితే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి పొత్తులో భాగంగా సుమలతకు కాంగ్రెస్‌ అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా నిలుస్తామంటూ బీజేపీ ముందుకొచ్చింది. దీంతో సుమలత- నిఖిల్‌ల మధ్య మాత్రమే ప్రధాన పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌- జేడీఎస్‌ నాయకుల మధ్య భేదాభిప్రాయాల కారణంగా నిఖిల్‌ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కుమారుడి కోసం రంగంలోకి దిగిన సీఎం కుమారస్వామి సుమలతను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. భర్త చనిపోయిన బాధ ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని.. ఏదో నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో విమర్శలకు సమాధానం చెబుతూనే సుమలత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెను ఓడించేందుకు అధికార పార్టీ మరో ఎత్తుగడకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. సుమలత పేరుతో మరో ముగ్గురు మహిళలు.. అది కూడా కుమారస్వామి సామాజిక వర్గానికి చెందిన వారు మండ్య స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తద్వారా సుమలతకు పడే ఓట్లను చీల్చాలనేదే వీరి ప్రధాన ఉద్దేశంగా కనపడుతోంది.(చదవండి : సుమలతపై కుమారస్వామి ఘాటు విమర్శలు)

ఇలా చేస్తారని ముందే తెలుసు..
సుమలత అంబరీష్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో భాగంగా తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసయ్యానని పేర్కొన్నారు. కాగా ఎం. సుమలత(భర్త పేరు- మంజె గౌడ) విద్యార్హత ఎనిమిదో తరగతిగా పేర్కొనగా, సుమలత(భర్త పేరు- సిద్దె గౌడ) ఏడో తరగతి వరకు చదివినట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటుగా మరో సుమలత(భర్త పేరు- కె.దర్శన్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక సుమలతా అంబరీష్‌ తరఫున దర్శన్‌ అనే నటుడు ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఈ విషయం గురించి సుమలతా అంబరీష్‌ మాట్లాడుతూ..‘ వాళ్లు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడతారని ముందే తెలుసు. నన్ను ఓడించడానికి వారు వేసిన ఎత్తుగడ. నేను కూడా వారిలా చేయవచ్చు కానీ అది నాకు నచ్చదు. నేరుగా, న్యాయంగా ‘యుద్ధం’ చేసి గెలవాలనుకుంటున్నా. వాళ్లలా దొంగచాటు రాజకీయాలు నాకు చేతకావు అని వ్యాఖ్యానించారు.

(చదవండి : నా భర్త ఆత్మకు శాంతి చేకూరాలంటే నిఖిల్‌కు ఓటు వేయాలా?!)

కాగా 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన అంబరీష్‌ సొంత నియోజకవర్గం మండ్య నుంచే కాంగ్రెస్‌ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. అంబరీష్‌ మరణం తర్వాత సుమలత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అభిమానులు ఒత్తిడి చేయగా ఆమె ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో కొడుకు గెలుపు కోసం కుమారస్వామి సహా ఆయన అనుచరవర్గం రంగంలోకి దిగడంతో.. ‘ఒక మహిళను ఓడించేందుకు ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి, మంత్రులు ఆమెపై చవకబారు విమర్శలకు దిగుతున్నారు. వాళ్ల మాటలు వింటుంటే ఇప్పటికే సుమలత సగం విజయం సాధించినట్లుగా అన్పిస్తుంది’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు