దావూద్ ముఠాకు మోడీ దడ

21 May, 2014 02:27 IST|Sakshi
దావూద్ ముఠాకు మోడీ దడ

అజ్ఞాతంలోకి ‘డాన్’  
అఫ్ఘాన్-పాక్ సరిహద్దుకు స్థావరం తరలింపు

 
 న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనపై భయంతో మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి ముఠా సభ్యులు అజ్ఞాతంలోకి పారిపోయారు. కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన దావూద్ తన డెన్‌ను అఫ్ఘాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్ల అధీనంలోని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే దావూద్ ను పాకిస్థాన్ నుంచి భారత్‌కు పట్టి తెస్తానని మోడీ ఎన్నికల ప్రచారంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మోడీ సర్కారు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనుండటంతో దావూద్‌పై నిఘా కట్టుదిట్టం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ భయంతోనే దావూద్ తన స్థావరాన్ని మారుమూల ప్రాంతానికి తరలించుకుని, ఐఎస్‌ఐ ద్వారా భద్రతను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
 
 ముంబైలోని అతడి ముఠా సభ్యులు సైతం నగరాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మోడీ అధికారంలోకి వస్తుండటంతో దావూద్‌లో ప్రాణభయం పెరిగిందని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, దావూద్‌ను పట్టుకునేందుకు మోడీ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధినేత అజిత్ దోవల్ సేవలను కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దోవల్ ప్రస్తుతం ఢిల్లీలోని వివేకానంద కేంద్రంలో పనిచేస్తున్నారు. పాకిస్థాన్ పట్ల బీజేపీ ఇప్పటికే తన కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఇటీవల ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ సైతం దావూద్ ఆచూకీని కనుగొనడంతో కొత్త ప్రభుత్వానికి సహకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు