ఇసుకాసురుల ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

Published Wed, May 21 2014 2:33 AM

stop the excavation of sand lance

 సాక్షి, నెల్లూరు : జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేయడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన ఇసుక రీచ్‌ల్లో మైనింగ్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 15తో గడువు పూర్తయింది. ఒక్క మినగల్లు రీచ్‌కు మాత్రం మరో నెల రోజులపాటు గడవు పొడిగింపునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని మిగిలిన రీచ్‌లన్నీ అధికారికంగా మూతపడ్డాయి. మొత్తం 14 రీచ్‌లకు గాను 11 రీచ్‌లను అధికారులు ఫైనలైజ్ చేసి మైనింగ్ ప్లాన్ అప్రూవల్‌కు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వెంటనే టెండర్లను పిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. నిన్నమొన్నటి వరకు ఈ వ్యవహారాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) చూసేది. తాజాగా సంబంధిత పనులను మైనిం గ్ శాఖకు ప్రభుత్వం అప్పగించింది.
 
 జిల్లాలోని కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో కోటితీర్థం, పడమటికంభంపాడు, లింగంగుంట, ముదివర్తిపాళెం, సూరాయపాళెం, పొట్టేపాళెం తదితర ప్రాం తాలున్నాయి. భూగర్భజలశాఖ అధికారులు సంబంధిత రీచ్‌లను, ప్రత్యేక ప్రదేశాలను గుర్తించిన అనంతరం పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది. సంబంధిత శాఖలు ఈ ప్రక్రియలో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్తగా రీచ్‌లకు టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియగానే మైనింగ్‌శాఖ అధికారులు ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించే పనులు ప్రారంభించనున్నారు.
 
 జోరుగా అక్రమ రవాణా
 మూడు నెలలుగా ఇసుక తవ్వకాలు అధికారికం గా నిలిచిపోవడంతో ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు భారీ స్థాయిలో ఇసుకరీచ్‌ల నుంచి దొడ్డిదారిన కొల్లగొడుతూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. గతంలో అధికారికంగా రీచ్‌లు నడిచే సమయంలో ఇసుకను తరలించి కొన్ని ప్రాంతాల్లో డంప్ చేసుకుని ఆ తర్వాత అధిక ధరలకు ఈ పాటికే విక్రయించేసుకున్నారు. ప్రస్తుతం రాత్రివేళలో ట్రాక్టర్లు, టైరు బండ్లు, ఆటోల ద్వారా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.1,800 నుంచి రూ. 2వేలు వరకు అమ్మేవారు. ప్రస్తుతం ఆ ధర రూ.2,700 నుంచి రూ. 3వేల వరకు పలుకుతోంది.
 
 అదనపు భారం
 సాధారణంగా వేసవిలో గృహనిర్మాణ పనులు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం ఇసుకకు డిమాండ్ పెరగడంతో పలువురు పనులు నిలిపివేసుకుంటున్నారు. ురికొందరు మాత్రం ఎంత ధరైనా చెల్లించేందుకు సిద్ధపడుతుండడంతో అక్రమంగా ఇసుకను కొల్లగొడుతున్న వారికి కాసుల వర్షం కురుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి మాత్రం అదనపు భారం పడుతోంది. ఇసుక కొలతల్లోనూ మోసాలు జరుగుతున్నాయి.
 
 అడ్డుకట్ట వేసేవారేరి...?
 ఓ వైపు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు, సిబ్బంది ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. వారికి ముట్టాల్సిన ముడుపులు ముడుతుండడమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికారులు, సిబ్బంది మూడు నెలలుగా ఎన్నికల విధుల్లో తలమునకలై ఉండడం కూడా ఇసుక మాఫియాకు కలిసొచ్చినట్లయింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement