ఓ కేంద్రమంత్రి.. రేప్కు మతానికి లింకేంటి?

10 Apr, 2015 09:38 IST|Sakshi
ఓ కేంద్రమంత్రి.. రేప్కు మతానికి లింకేంటి?

పనాజీ: పశ్చిమ బెంగాల్లో జరిగిన నన్పై లైంగికదాడి విషయంలో బీజేపీ నేత, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. అత్యాచారానికి, మతానికి సంబంధం పెడుతూ వ్యాఖ్యలు చేయడమేమిటని గోవా కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా విమర్శించింది. బీజేపీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం స్పందించిన ఆయన బెంగాల్లో నన్పై జరిగిన లైంగికదాడిని ప్రస్తావించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు.

దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అయితే, వీటికి పార్టీకి, పార్టీ సంస్థలకు, పార్టీ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సిద్ధాంతాలు, తమ విధానాలు అనుసరించేవారు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, ప్రతి దానికి తమను నిందించడం అలవాటుగా మారిందన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్రమంత్రి అయ్యి ఉండి లైంగికదాడిని మతంతో ముడిపెట్టడం సబబేనా అని ప్రశ్నించింది. ఎప్పటికీ అరెండు విషయాలకు జతకట్టకూడదని పేర్కొంది. లైంగికదాడి అనేది మానసిక వైకల్యంతో కూడిన ఓ వ్యక్తి చేసే దుశ్చర్య అని, ఆ వ్యక్తిని శిక్షించాలే తప్ప ఇలా మతాల విషయాలు తెరమీదకు తీసుకురాకూడదని చెప్పారు.

మరిన్ని వార్తలు