ఇష్టపడిన అమ్మాయిలు.. మోసగించి పెళ్లి..

24 Apr, 2018 10:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ఒకరినొకరు ఇష్టపడిన అమ్మాయిలు కుటుంబాలను మోసగించి వివాహం చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఇద్దరు యువతుల్లో ఒకరు పురుషుడిలా నటించి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయించారు.

జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఇద్దరు యువతులకు రెండేళ్లుగా పరిచయం ఉంది. తోటివారే కావడంతో కుటుంబ పెద్దలు కూడా వారు చనువుగా ఉండటంపై నిబంధనలు పెట్టలేదు. ఈ నెల 16న నకిలీ తల్లిదండ్రులను సాక్ష్యులుగా చూపుతూ ఫేక్‌ ఐడీ కార్డులను సృష్టించిన వారు వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇద్దరు యువతుల్లో ఒకరు కార్తీక్‌ శుక్లా(వరుడిలా) అనే పేరుతో నకిలీ ఆధార్‌​కార్డును సృష్టించారు.

వివాహం చేసుకున్న వారిని కుటుంబ పెద్దలు పెద్దమనసుతో ఆశీర్వదించారు. అయితే, శనివారం కార్తీక్‌ శుక్లా వేషధారణలో ఉన్న యువతి అబ్బాయి కాదని గుర్తించిన వధువు తల్లిదండ్రులు ఆమె ఇంటిపై దాడి చేశారు. దీంతో వధువు మేడ మీది నుంచి కిందికి దూకింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకోవడంతో వివాదం సద్దమణిగింది.

భారత్‌లో స్వలింగ వివాహం చట్టబద్దమేనా?
స్వలింగ సంపర్కాన్ని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) సెక్షన్‌ 377 సమర్థించడం లేదు. ప్రకృతికి విరుద్ధమైన స్వలింగ సంపర్కం చట్ట రీత్యా నేరంగా భారత్‌లో పరిగణిస్తున్నారు. అయితే, స్వలింగ వివాహంపై ఈ సెక్షన్‌లో ఎలాంటి సూచనలు చేయలేదు. వ్యక్తిగత విషయాల్లో గోప్యతపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరం సెక్షన్‌ 377పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కాగా, సోమవారం సెక్షన్‌ 377 కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా స్పందించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు