ఫిర్యాదు చేసిందని...నిప్పంటించారు

8 Mar, 2016 13:33 IST|Sakshi

లక్నో:  ఉత్తరప్రదేశ్ లో మరో  దారుణం వెలుగు  చూసింది. తమ వాడిపై ఫిర్యాదు చేసిందనే అక్కసుతో నిందితుడి కుటుంబ సభ్యులు..  బాలిక (11) పై  హత్యాయత్నం చేసిన  ఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు  వెలుగులోకి వచ్చింది.  లైంగిక వేధింపుల కేసు పెట్టిందనే ఆగ్రహంతో బాధిత బాలికను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన ఘటన సోమవారం రాత్రి  చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన వివరాల  ప్రకారం.. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఇంటర్ విద్యార్థిని గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన నిందితుడి కుటుంబ సభ్యులు ఆమెను హతమార్చడానికి పూనుకున్నారు. ఆమె తల్లిదండ్రులెవరూ ఇంట్లో లేని సమయంలో దాడి చేసి..కిరోసిన్ పోసి నిప్పంటించారని  పోలీసులు మంగళవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోందని  పోలీసు ఉన్నతాధికారి  తెలిపారు.

మరిన్ని వార్తలు