నిత్యావసరాలకు రెక్కలు...

27 Feb, 2015 01:37 IST|Sakshi

- రైల్వే రవాణా చార్జీల మోత
- ఆహార ధాన్యాల నుంచి బొగ్గు దాకా
-12 కమోడిటీలు మరింత ప్రియం

న్యూఢిల్లీ: టికెట్ చార్జీలను పెంచకుండా వదిలేసి ప్రయాణికులను కనికరించినా .. సరుకు రవాణా చార్జీలను మాత్రం భారీగా పెంచడం ద్వారా అందరిపైనా భారం మోపారు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.  రైల్వే బడ్జెట్‌లో 12 కమోడిటీలపై 0.8 శాతం నుంచి 10 శాతం దాకా రవాణా చార్జీల పెంపును ప్రతిపాదించారు. దీనితో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సిమెంటు, బొగ్గు, ఉక్కు మొదలైన వాటన్నింటి ధర లు దాదాపు 10 శాతం దాకా పెరగనున్నాయి. యూరియా రవాణా చార్జీ కూడా 10 శాతం పెంచడం వల్ల సబ్సిడీ భారం కూడా ఆ మేర పెరగనుంది.

యూరియా రవాణా చార్జీలకు చెల్లించే సబ్సిడీ ప్రస్తుతం రూ. 3,000 కోట్ల మేర ఉండగా.. తాజా పరిణామంతో మరో రూ. 300 కోట్ల భారం పడనుందని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. మరోవైపు, సిమెంటు ఉత్పత్తి వ్యయం ప్రతి బస్తాకి (50 కేజీలు) రూ. 2-4 మేర పెరుగుతుందని దాల్మియా భారత్ సిమెంటు గ్రూప్ సీఈవో మహేంద్ర సింగి తెలిపారు. రేటు పెంచడమనేది డిమాండు, సరఫరాపై ఆధారపడి ఉంటుందని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. రవాణా చార్జీల పెంపుతో సిమెంటు రేట్లు బస్తాకి రూ. 5-10 మేర పెరిగే అవకాశాలున్నాయని మరో సిమెంటు తయారీ సంస్థ వర్గాలు తెలిపాయి.
 
ఉక్కు కంపెనీల మిశ్రమ స్పందన..
రైల్వే సరకు రవాణా చార్జీల పెంపుపై ఉక్కు కంపెనీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఉక్కుకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. డీజిల్ ధర తగ్గినప్పటికీ రవాణా చార్జీలను తగ్గించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇనుము, ఉక్కు రవాణా చార్జీల పెంపు ప్రభావం తమపై పెద్దగా ఉండబోదని కొన్ని ఉక్కు తయారీ సంస్థలు తెలిపాయి. యూరియా ధరలు పెరగబోవని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. యూరియా ధర ఇప్పుడున్నట్లే టన్నుకు రూ. 5,360గానే కొనసాగుతుందని, సబ్సిడీ భారం  పెరుగుతుందని వివరించారు. రైతులకిచ్చే ఎరువుల ధరలు పెరగబోవని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా కూడా తెలిపారు.
 
పెంపు తీరిదీ..

రవాణా చార్జీలు సిమెంటుపై 2.7%, బొగ్గుపై 6.3%, ఇనుము..ఉక్కుపై 0.8%, ఆహార ధాన్యాలు..పప్పు ధాన్యాలపై 10%, వేరుశనగ నూనెపై 2.1%, ఎల్‌పీజీపై 0.8%, కిరోసిన్‌పై 0.8% మేర పెరగనున్నాయి. మరోవైపు సున్నపురాయి, డోలోమైట్, మ్యాంగనీస్, స్పీడ్ డీజిల్ ఆయిల్ మొదలైన వాటి రవాణా చార్జీలు మాత్రం సుమారు 1 శాతం దాకా తగ్గనున్నాయి.
 
పెరగనున్న విద్యుత్ చార్జీలు..
బొగ్గు రవాణా చార్జీల పెంపు మూలంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయాలూ 2 శాతం మేర (యూనిట్‌కు సుమారు 4-5 పైసలు) పెరుగుతాయని ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీ తెలిపింది.  ఇది రిటైల్ విద్యుత్ టారిఫ్‌లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, విద్యుత్ చార్జీలూ యూనిట్‌కు 5 పైసల మేర పెరగొచ్చని విద్యుదుత్పత్తి కంపెనీల అసోసియేషన్ ఏపీపీ పేర్కొంది. బొగ్గు రవాణా చార్జీలు 6.3 శాతం పెరిగితే విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 3-5 పైసల మేర పెరుగుతాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ టచ్ తొమాత్సు ఇండియా సీనియర్ డెరైక్టర్ దేబాశీష్ మిశ్రా తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు