సీఐసీలోకి నలుగురు కొత్త కమిషనర్లు

31 Dec, 2018 05:24 IST|Sakshi
సురేశ్‌ చంద్ర

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌లో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌లో మొత్తం ఉండాల్సిన కమిషనర్ల సంఖ్య 11 కాగా, ప్రస్తుతం అందులో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌(సీఐసీ) సహా ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు. తాజాగా మాజీ ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌) అధికారి యశ్‌వర్ధన్‌ కుమార్‌ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి వనజ ఎన్‌ సర్నా, మాజీ ఐఏఎస్‌ అధికారి నీరజ్‌ కుమార్‌ గుప్తా, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి సురేశ్‌ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరి నియామకంతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది.

సిన్హా 1981 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. యూకేలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. తాజా నియామకంతో వనజ(1980 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి) సీఐసీలోని ఏకైక మహిళా కమిషనర్‌గా నిలవనున్నారు. గుప్తా 1982 ఐఏఎస్‌ అధికారి కాగా, సురేశ్‌ చంద్ర ఈ ఏడాదే న్యాయశాఖ కార్యదర్శిగా రిటైర్‌ అయ్యారు. 2002–04 మధ్య ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ప్రైవేట్‌ సెక్రటరీగా కూడా చంద్ర ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు(బ్యూరొక్రాట్స్‌) కాకుండా.. లా, సైన్స్, సోషల్‌ సర్వీస్, మేనేజ్‌మెంట్, జర్నలిజం  తదితర రంగాల్లోని నిపుణులకు(నాన్‌ బ్యూరొక్రాట్స్‌) కమిషనర్లుగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 12(5)ని ఉటంకిస్తూ మాజీ కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు విజ్ఞప్తిని తాజా నియామకాల్లో కేంద్రం పట్టించుకోలేదు. 

>
మరిన్ని వార్తలు