ద్రవ్యలోటుపై లక్ష్యాన్ని చేరుకుంటాం

16 Sep, 2018 03:13 IST|Sakshi

బడ్జెట్‌ అంచనాలను మించి జీడీపీ వృద్ధి సాధిస్తాం

ప్రధానితో భేటీ అనంతరం అరుణ్‌ జైట్లీ వెల్లడి

‘పెట్రో పన్ను’ తగ్గింపుపై సమాధానం దాటవేత  

న్యూఢిల్లీ: పెరుగుతున్న పన్ను ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల మద్దతుతో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతానికి పరిమితం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం వెల్లడించారు. అయితే పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశన్నంటుతున్నా, వాటిపై పన్నులను తగ్గించే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

కరెంట్‌ ఖాతా లోటును తగ్గించేందుకు, డాలర్‌తో రూపాయి మారకం విలువను బలపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్ర, శనివారాల్లో స్థూల ఆర్థిక సమీక్షా సమావేశం జరిగింది. శనివారం సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ ‘బడ్జెట్‌లో చెప్పిన 7 నుంచి 7.5 శాతం కంటే ఎక్కువే జీడీపీ వృద్ధిని సాధిస్తాం. మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకుంటాం. బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే పన్ను వసూళ్లను రాబడతాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను విక్రయించడం ద్వారా లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువే సమీకరిస్తాం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

పెట్రో ధరలపై సమాధానం నిరాకరణ
పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నులను తగ్గించే అంశంపై సమావేశంలో చర్చించారా లేదా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు పెట్రో పన్నుల తగ్గింపుపై కూడా సమావేశంలో చర్చిస్తారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. కానీ ఆ దిశగా ముందడుగు పడలేదు. రూపాయి బలహీనపడుతుండటంటో ముడిచమురు కొనుగోలు భారంగా మారుతోందనీ, దీంతో కరెంట్‌ ఖాతా లోటుపై తీవ్ర ప్రభావం పడుతోందని జైట్లీ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. తాము చేపట్టిన నల్లధన వ్యతిరేక చర్యలు, నోట్లరద్దు, జీఎస్టీతోనే పన్ను ఆదాయం పెరిగిందని జైట్లీ చెప్పుకొచ్చారు. ‘బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువే పన్ను వసూళ్లు ఈ ఏడాది వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి  స్పష్టం చేస్తోంది.  కొన్ని నెలల్లో వస్తు, సేవల వినియోగం పెరిగితే పరోక్ష పన్ను రాబడి కూడా పెరుగుతుంది’ అని జైట్లీ తెలిపారు.

మరిన్ని వార్తలు