‘ఆ మహిళల మైండ్‌సెట్ మారాలి’

27 Aug, 2016 17:57 IST|Sakshi
‘ఆ మహిళల మైండ్‌సెట్ మారాలి’

ముంబై: నగరంలోని హజీ అలీ దర్గాలోకి వెళ్లి సూఫీ ముస్లిం గురువు సమాధిని సందర్శించుకునేందుకు మహిళలకు కూడా హక్కుందని ముంబై హైకోర్టు శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పు పట్ల మహిళల స్పందనలు భిన్నంగా ఉన్నాయి. ఇతర మతాల మహిళలు దీన్ని ఎక్కువగా హర్షిస్తూ వారు దీన్ని మహిళల విజయంగా పేర్కొంటుండగా,  ముస్లిం మహిళల్లోనే ఎక్కువ మంది భిన్నంగా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుతో తమకు సంబంధం లేదని, తాము మాత్రం గర్భగుడి, సూఫీ సమాధి వద్దకు వెళ్లమని, ఎప్పటిలాగే దూరం నుంచి దర్శించుకొని పోతామని చెబుతున్నారు.

 600 సంవత్సరాల క్రితానికి చెందిన సూఫీ గురువు సయ్యద్ పీర్ హజీ అలీ షా బుఖారి సమాధిని దర్శించుకునేందుకు 2011 సంవత్సరం వరకు దర్గా నిర్వాహకులు మహిళలను లోపలికి అనుమతించారు. అప్పటి వరకు అనుమతించిన వారు ఎందుకు హఠాత్తుగా మహిళలపై నిషేధం విధించారు? అప్పటి వరకు ఎలాంటి సందేహం లేకుండా సూఫీ సమాధిని సందర్శించుకున్న ముస్లిం మహిళలు ఇప్పుడు ఎందుకు సమాధి వద్దకు వెళ్లడానికి సందేహిస్తున్నారు? వారి వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడైనా మహిళల మైండ్‌సెట్ మారాలని మహిళల నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

‘కోర్టు తీర్పు ఆసక్తిదాయకంగానే ఉంది.
ఇతర మహిళలు దర్గా లోపలికి వెళితే వెళ్లనీయండి. ముస్లిం మహిళలు లోపలికి వెళ్లకుండా దూరం నుంచే సమాధిని సందర్శించుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం’ అని శుక్రవారం దర్గాను సందర్శించిన 30 ఏళ్ల ఇల్లాలు నసీం బానో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. మేము దర్గా లోపలికి వెళ్లం. అది మగవాళ్ల హక్కు మాత్రమే’ అని షరీఫ్ పఠాన్ అనే మరో మహిళ వ్యాఖ్యానించారు. అడవాళ్లకు రుతుస్రావం లాంటి సమస్యలుంటాయి కనుక దర్గా లోపలికి వెళ్లకపోవడమే మంచిదని పఠాన్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఉందే సమస్యల కారణంగానే కేరళలోని శబరిమళ ఆలయంలోకి, మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదనే విషయం తెల్సిందే.

 ముస్లిం ఏతర మహిళలు మాత్రం ఇది మహిళల గొప్ప విజయమని అభివర్ణిస్తున్నారు. ముంబై హైకోర్టు తీర్పు వెలువడిన రోజునే తాను దర్గాకు రావడం తన అదృష్టమని ఢిల్లీ నుంచి వచ్చిన భక్తురాలు మృణాలిని మెహతా లాంటి వారు వ్యాఖ్యానించారు. అయితే తీర్పు వెలువడిన వెంటనే దర్గాలోని సమాధిని సందర్శించే అవకాశం మాత్రం ఇంకా మహిళలకు దక్కలేదు. దర్గా నిర్వాహకులు తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలుపై హైకోర్టు స్టే మంజూరు చేసిన విషయం తెల్సిందే.
 

మరిన్ని వార్తలు