జాట్‌ల రిజర్వేషన్‌పై స్టే

27 May, 2016 01:49 IST|Sakshi

పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వులు
చండీగఢ్: జాట్‌లతోపాటు మరో ఐదు వర్గాలకు బీసీ (సీ) కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తెచ్చిన చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించింది. హర్యానా వెనుకబడిన తరగతుల (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్) చట్టం-2016ను హర్యానా అసెంబ్లీ గత మార్చి 29న ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.. దీని చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్‌ఎస్ సరోన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దీనిపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

మురారిలాల్ గుప్తా అనే వ్యక్తి కొత్తగా తెచ్చిన బీసీ (సీ) కేటగిరీని సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక మేరకు ప్రభుత్వం జాట్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించిందని, అయితే ఈ కమిషన్ నివేదికను అప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషనర్ చెప్పారు. న్యాయ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ రిజర్వేషన్ చెల్లుబాటుకాదన్నారు. ఈ కమిషన్ నివేదికలోని అంశాలపై సవరణలు చేసే అధికారం కేవలం న్యాయవ్యవస్థకే ఉందని, దీనిపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు